త్వరలో 10వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తాం

వికలాంగులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దగ్గుపాటి

ప్రజాశక్తి-అనంతపురం రూరల్‌

అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో త్వరలో 10వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ తెలిపారు. మంగళవారం వినాయక నగర్‌, భాగ్యనగర్‌లో మున్సిపల్‌ కమిషనర్‌ నాగరాజు, సచివాలయ సిబ్బందితో కలిసి మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇళ్లు, డ్రెయినేజీ, రేషన్‌ బియ్యం సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం ఒక్క ఇల్లు నిర్మించిన పాపానపోలేదన్నారు. వైసిపి నాయకులు మాయమాటలు చెబుతూ కాలం గడిపారని విమర్శించారు. సిఎం చంద్రబాబు సహకారంతో త్వరలోనే అనంతపురంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ఏర్పాటు చేయడంతోపాటు డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ గుర్రం నాగభూషణ, పావురాల శేఖర్‌, టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాయల్‌ మురళి, అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌ కృష్ణకుమార్‌, టిఎన్‌టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచపు వెంకటేష్‌, మాజీ కో ఆప్షన్‌ మెంబర్‌ మున్వర్‌, నాయకులు టైలర్‌ సీనా, సిరిశాల రాంబాబు, ఈడిగా నాగభూషణం, సుంకన్న, పవన్‌ కుమార్‌, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.వందశాతం వికలత్వ పింఛన్‌కు లేఖ2వ డివిజన్‌లో దీనస్థితిలో ఉన్న వికలాంగులు కాయల అఖిల, వెనుగోపాల్‌, పుష్పలతను చూసి ఎమ్మెల్యే ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. బాధితులు కన్నీరు పెట్టుకోవడంతో ఓదార్చారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడగ్గా ప్రస్తుతం రూ.6వేలు పింఛన్‌ వస్తోందని, మరింత సాయం చేయాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ ముగ్గురికీ 100శాతం వికలత్వం కింద ఇచ్చే రూ.15వేల పింఛన్‌ ఇవ్వాలని డిఎంహెచ్‌ఒకు లేఖ రాశారు.

➡️