సెల్‌ఫోన్‌ చోరీలపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ

బాధితులకు సెల్‌ఫోన్లు అందజేస్తున్న ఎస్పీ మురళీకృష్ణ

ప్రజాశక్తి-అనంతపురం క్రైం

సెల్‌ఫోన్‌ చోరీలపై ప్రత్యేక నిఘా ఉంచి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కెవి.మురళీకృష్ణ సూచించారు. శుక్రవారం రూ.53 లక్షల విలువజేసే 266 సెల్‌ఫోన్లను బాధితులకు అందజేశారు. వీటిలో పోగొట్టుకున్నవి 221 కాగా 45 చోరీకి గురైనవి ఉన్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పుడు అందజేసిన వాటితో కలిపి జిల్లా పోలీసు శాఖ రూ.15.04 కోట్ల విలువజేనే 8,886 ఫోన్లను బాధితులకు అందజేశామన్నారు. ప్రస్తుతం అందజేస్తున్న మొబైల్‌ ఫోన్లలో అనంతపురం జిల్లా నుంచి 183, శ్రీసత్యసాయిలో 41, కర్నూలులో 15, కర్ణాటకలో 11, చిత్తూరులో 5, తెలంగాణలో 6, విశాఖపట్నంలో ఒక ఫోన్‌ను రికవరీ చేశామన్నారు. ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయొద్దన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, తదితర ప్రదేశాల్లో మోసపు మాటలతో నమ్మబలికే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మొబైల్‌ ఫోన్లు తస్కరించే వారిపై ప్రత్యేక నిఘా వేశామని, చాట్‌బాట్‌ సేవల ద్వారా బాధితులకు న్యాయం చేస్తున్నామన్నారు. ఫోన్‌ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా చాట్‌ బాట్‌ లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎంఇఐ సేవలు ద్వారా నమోదు చేసుకోవాలని, ఎలా నమోదు చేసుకోవాలో వివరించారు.

➡️