సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
ప్రజాశక్తి-కళ్యాణదుర్గం
నియోజకవర్గంలో ఉద్యాన పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. పట్టణంలోని ప్రజావేదికలో శుక్రవారం ఎమ్మెల్యే ఉద్యాన పంటలు, ఉపాధి పనులపై నియోజకవర్గంలోని అన్ని మండలాల ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యాన పంటలకు సంబంధించి బిల్లులు ఆలస్యం లేకుండా త్వరగా వచ్చేలా చూస్తామని తెలిపారు. కరువు ప్రాంతమైన కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం సిఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని, అందులో భాగంగా నియోజకవర్గంలో 3,500 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగుకు అనుమతులు ఇచ్చారన్నారు. అవసరమైతే మరిన్ని ఎకరాలకు అనుమతులు ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో మన ప్రాంతానికి కృష్ణా జలాలు వస్తాయని రైతులు పండ్ల మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు సాగు చేసిన పంటలకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యేలా తనవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చకుండా రైతుల శ్రేయస్సు కోసం పాటుపడాలని కోరారు. ఇదివరకూ ప్రభుత్వం కేటాయించిన పథకాల్లో రైతులు భాగస్వాములు కావాలని అందుకోసం అధికారులు కూడా అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రతి గ్రామంలో నెలకొన్న సమస్యలు తెలుసుకుని ఈ నెల 15వ తేదీ పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. గ్రామంలో అందరినీ కలుపుకుని సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు. చెరువుల్లో పూడికతీత, కాలువల పునరుద్ధరణ, ఫారంపాండ్లు, తదితర పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు మోరేపల్లి మల్లి కార్జున, లక్ష్మీనారాయణచౌదరి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ రమేష్, వెంకటేశులు పాల్గొన్నారు.