అపరిష్కృత సమస్యలపై పోరాటాలు

అంగన్‌వాడీల సదస్సులో ప్రసంగిస్తున్న సుబ్బరావమ్మ

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

అపరిష్కృతంగా ఉన్న అంగన్‌వాడీల సమస్యలపై మరింత ఐక్యంగా భవిష్యత్తులో పోరాటాలు సాగించనున్నట్లు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ తెలిపారు. ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్లు యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక గణేనాయక్‌ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుబ్బరావమ్మ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు,చిన్నారులకు అంగన్‌వాడీలు విశేష సేవలు అందిస్తున్నారన్నారు. వీరిని గుర్తించడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం కొనసాగుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ అమలు చేయాల్సి ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కోసం యూనియన్‌ ఆధ్వర్యంలో చారిత్రక పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు. ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలు ఉద్యమాలపై ఎంతటి నిర్బంధాన్ని విధించిన ఎదిరించి పోరాడమన్నారు. ఐక్య పోరాటాల ఫలితంగా కనీస వేతనం వర్కర్‌కు రూ.11,500 హెల్పర్‌కు రూ.7వేలు, మినీ వర్కర్‌కు రూ.7వేలు సాధించుకున్నట్లు తెలిపారు. సెంటర్లు అద్దెలు, ప్రసూతి సెలవులు, వర్కర్లకు సూపర్‌వైజర్ల పోస్టుల్లో 50 శాతం ఉద్యోగోన్నతులు ఉద్యోగవిరమణ వయోపరిమితి, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ తదితర వాటిని సాధించుకున్నామన్నారు. అంగన్‌వాడీల్లో ప్రయివేటు జోక్యాన్ని తిప్పికొట్టామన్నారు. ఇంకా అంగన్‌వాడీలకు అపరిష్కృతంగా అనేక సమస్యలు ఉన్నాయని వాటి కోసం నిరంతర పోరాటం సాగిస్తున్నామన్నారు. అంగన్వాడీ వర్కర్లను మూడో తరగతి, హెల్పర్లను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కనీస వేతనాలు రూ.26 వేలు, ఇచ్చి, పింఛన్‌, పిఎఫ్‌, ఇఎన్‌ఎస్‌ సౌకర్యం కల్పించాల్సి ఉందన్నారు. అంగన్‌వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 164 సూపర్‌ వైజరుపోస్టులను భర్తీ చేయాలన్నారు. రాబోయే కాలంలో ఈ సమస్యలన్నింటిపై పోరాటం కొనసాగుతుందన్నారు.

విద్యుత్‌ ఛార్జీల పెంపుపై నిరసన

          రాష్ట్ర వ్యాప్తంగా చాలీచాలని వేతనాలతో పెరిగిన ధరలతో సతమతమవుతున్న తరుణంలో విద్యుత్‌ ఛార్జీల భారాల వేయడం తగదన్నారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీల బిల్లులను భోగి మంటల్లో వేసి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ నాగేంద్ర కుమార్‌, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శకుంతల, రమాదేవి, కాత్యాయని జ్యోతి లతా, విజయ, శ్రీదేవి, రంగమ్మ, నక్షత్ర, రేవతి, అరుణ, పాతక్క, రామాంజనమ్మ, విజయనిర్మల, తిప్పీరమ్మ పాల్గొన్నారు.

➡️