విద్యార్థి యశ్వంత్‌రెడ్డిని అభినందిస్తున్న కళాశాల యాజమాన్యం
ప్రజాశక్తి-అనంతపురం
అనంతపురం నగరంలోని ఎస్వీ డిగ్రీ, పీజీ కళాశాలలో బీకామ్ తతీయ సంవత్సరం చదువుతున్న కె.యస్వంత్ రెడ్డి అద్భుత ప్రతిభ చాటాడు. అతను స్థాపించిన ధన్విన్ ఎకో వుడ్స్ స్టార్టప్‌కు అమెరికాకు చెందిన బ్లూఫ్లూట్ వెంచర్స్ ఎల్‌ఎల్‌సి నుంచి రూ.45 లక్షల పెట్టుబడిగా లభించింది. ఇదే విద్యార్థికి 2023లో అటల్ ఇంక్యూబేషన్ సెంటర్ ఎస్‌కె యునివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టార్టుప్ జాతర కార్యక్రమంలో బెస్ట్ స్టార్టుప్ అఫ్ ది ఇయర్ ప్రశంసాపత్రం పొందారు. అప్పట్లో స్టార్టుప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీం ద్వారా రూ.5లక్షల పెట్టుబడి సాయం పొందాడు. ఇంతటి విజయాన్ని సాధించిన విద్యార్థి యశ్వంత్‌రెడ్డిని మంగళవారం కళాశాలలో అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ఛైర్మన్ చక్రధర రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి సాధించిన ప్రతిభ ఎంతో గొప్పదన్నారు. ప్రతి విద్యార్థీ వినూత్న ఆలోచనలతో ముందుకెళ్లి మంచి విజయాలు సాధించాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా||ఎన్‌ఎవి.ప్రసాద్, ఏవో శ్రీనాథ్, డా||ఎస్.రిజ్వానా బేగం పాల్గొన్నారు.