జగన్‌ను గద్దె దింపడమే లక్ష్యం : టిడిపి

విలేకరులతో మాట్లాడుతున్న అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు దగ్గుబాటి ప్రసాద్‌, అంబికా లక్ష్మినారాయణ

         అనంతపురం : రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా అన్ని ప్రాంతాలనూ సర్వనాశనం చేసిన వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని గద్దె దింపడమే లక్ష్యంగా టిడిపి, జనసేన, బిజెపిలు కలిసికట్టుగా పని చేస్తాయని అనంతపురం అర్బన్‌ నియోజకవర్గం కూటమి అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్‌, అనంతపురం పార్లమెంట్‌ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ స్పష్టం చేశారు. టికెట్ల ప్రకటన అనంతరం టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి సమావేశాన్ని బుధవారం నిర్వహించాయి. ఈ సందర్భంగా దగ్గుబాటి ప్రసాద్‌ మాట్లాడుతూ తనకు అనంతపురంతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. టికెట్‌ ప్రకటన తర్వాత పార్టీలో కొన్ని అసంతప్తులు ఉన్నా అధిష్టానం వాటిని పరిష్కరిస్తుందని తెలియజేశారు. తమ పార్టీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులన్నింటినీ ఎత్తేసేలా టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అర్బన్‌ నియోజకవర్గంలో న్యాయపోరాటం చేస్తామన్నారు. అర్బన్‌ నియోజకవర్గంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ఏర్పాటుకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. పారిశ్రామికవేత్తగా ఉన్న తాను నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చే దిశగా కృషి చేస్తానని తెలియజేశారు. పింఛన్ల పంపిణీ విషయంలో అధికార పార్టీ కొత్త డ్రామాలకు తెర లేపిందన్నారు. కావాలనే వైసిపి పింఛన్ల పంపిణీని రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని స్థానాల్లోనూ విజయం సాధిస్తాంటిడిపి అనంత పార్లమెంట్‌ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణఅనంతపురం పార్లమెంట్‌తో పాటు దాని పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయం సాధిస్తుందని అనంతపురం పార్లమెంట్‌ టిడిపి అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ తెలియజేశారు. తాము నాన్‌ లోకల్‌ అంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎంపీలుగా పోటీ చేసిన తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌ ఈ జిల్లా వాసులే కాదన్నారు. ప్రస్తుతం అనంతపురం పార్లమెంటు బరిలో ఉన్న శంకర్‌ నారాయణ ధర్మవరం వాసి అన్నారు. హిందూపురం పార్లమెంట్‌ బరిలో ఉన్న శాంతమ్మ బళ్లారి ప్రాంతానికి చెందిన మహిళ అన్నారు. వీటిని మరచిన వైసిపి నాయకులు తమను మాత్రం నాన్‌లోకల్‌ అంటూ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతపురం పార్లమెంట్‌ పరిధిలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉందని వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్‌ స్థానంతో పాటు దాని పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో టిడిపి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజీపీ రాష్ట కార్యదర్శి లలిత్‌ కుమార్‌, టిడిపి రాష్ట్ర కార్యదర్శి బుగ్గయ్య చౌదరి, టౌన్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు జెఎల్‌.మురళి, మాజీ మేయర్‌ మదమంచి స్వరూప, మహిళా విభాగ రాష్ట అధికార ప్రతినిధి సంగా తేజస్విని, సిమెంట్‌ పోలన్న, టిడిపి సీనియర్‌ మాసినేని రామయ్య, ఆదెన్న, రాయల్‌ మురళి, గుత్తా ధనుంజరు నాయుడు, మారుతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️