2వ పట్టణ సిఐకి వినతిపత్రం అందజేస్తున్న మేయర్ వసీం, కార్పొరేటర్లు
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్
నగరంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫ్లెక్సీలు చించివేయడం తగదని మేయర్ మహమ్మద్ వసీం అన్నారు. దసరా పండుగ సందర్భంగా నగరంలోని సప్తగిరి సర్కిల్, టవర్‌క్లాక్ వద్ద మేయర్ మహమ్మద్ వసీం నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే గురువారం రాత్రి కొందరు వీటిని చించివేశారు. దీంతో శుక్రవారం ఎస్పీ, డీఎస్పీని కలవడానికి మేయర్ ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాకపోవడంతో 2వ పట్టణ సీఐ శ్రీకాంత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇందుకు సిఐ స్పందిస్తూ ఫ్లెక్సీలు చించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు. అనంతరం మేయర్ మహమ్మద్ వసీం విలేకరులతో మాట్లాడుతూ తాను మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నిమతాల పండుగలకు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నానన్నారు. ఐదేళ్ళ వైసిపి పాలనలో అన్నిపార్టీల వారితోపాటు కుల సంఘాల నేతలు, వ్యాపారులు, ప్రయివేటు వ్యక్తులు ఆయా సందర్భాలను బట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోనేవారన్నారు. కొన్నిరోజుల తర్వాత కార్పొరేషన్ అధికారులు వాటిని తొలగించేవారన్నారు. అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఫ్లెక్సీలు కక్షపూరితంగా తొలగిస్తున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. రాష్టంలో రెడ్‌బుక్ పాలన కొనగసాగుతోందన్నారు. ఫ్లెక్సీలు తొలగింపు రెడ్‌బుక్ రాజ్యాంగంలో ఏమైనా ఉందా.. అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి నగరంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సైఫుల్లా, నరసింహులు, కమల్‌భూషణ్, రహంతుల్లా, తదితరులు పాల్గొన్నారు.