పోరాట యోధుడు వడ్డే ఓబన్న

ఓబన్నకు నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు వడ్డే ఓబన్న అని పలువురు నాయకులు, అధికారులు కొనియాడారు. వడ్డె ఓబన్న జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా శనివారం నాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వడ్డె ఓబన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ డా||వి.వినోద్‌ కుమార్‌ జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ బోయ గిరిజమ్మ, కడప ఆర్టీసీ రీజినల్‌ ఛైర్మన్‌ పూల నాగరాజు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ బి.వినూత్న తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో వడ్డే ఓబన్న పాత్ర మరవలేనిదన్నారు. బ్రిటీష్‌ పాలకులు వేసే పన్నులకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. ఆ పోరాటంలోనే ఆయన మరణించారని తెలిపారు. నేటి యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని దేశం, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జి డిడి సుభాషిని, జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డి, డ్వామా పీడీ సలీం బాషా, పశుసంవర్ధక శాఖ జెడి వెంకటస్వామి, ఐఅండ్‌పిఆర్‌ డిఐపిఆర్‌ఒ గురుస్వామి శెట్టితో పాటు వడ్డెర కుల పెద్దలు పాల్గొన్నారు.

➡️