నూతన మద్యం పాలసీ నష్టదాయకం

కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న మహిళా సంఘాల జెఎసి నాయకులు

పజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమలు చేయబోతున్న నూతన మద్యం పాలసీ సమాజానికి మరింత నష్టదాయకం అని మహిళా సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. నూతన మద్యం పాలసీని రద్దు చేసి, ప్రభుత్వమే నాణ్యమైన మద్యాన్ని విక్రయించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం నాడు అనంతపురం డిఆర్‌డిఎ కార్యాలయంలో నిర్వహించిన డివిజనల్‌ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల జెఎసి నాయకులు వి.సావిత్రి, పార్వతీ ప్రసాద్‌, సరస్వతి మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ అమలైతే ప్రయివేటు వ్యక్తులు చేతుల్లోకి మద్యం అమ్మకాలు వెళ్తాయన్నారు. వారు లాభాపేక్షతో విచ్చలవిడి మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తారన్నారు. నూతన మద్యం పాలసీలో మద్యం విక్రయాల సమయం కూడా పెంచడం సరికాదన్నారు. రాత్రిళ్లు మద్యం విక్రయాలు చేయడం ద్వారా మద్యం సేవించి మహిళలు ఆడపిల్లలపై అత్యాచారం, అఘాయిత్యాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. విచ్చలవిడిగా మద్యం విక్రయాల వల్ల చిన్నపిల్లలు సైతం మద్యం సేవించి జీవితాలను నాశనం చేసుకుంటూ, ఇతరుల జీవితాలనూ నాశనం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం పునరాలోచించి మద్యాన్ని నియంత్రించాలన్నారు. మద్యం షాపులను ప్రభుత్వం ఆధీనంలోనే నిర్వహించాలన్నారు. ఆధార్‌ కార్డు ఆధారంగా మద్యం విక్రయాలు జరపాలన్నారు. 20 సంవత్సరాల్లోపు పిల్లలు వస్తే మద్యం విక్రయించరాదన్నారు. గుడి, బడి ఉన్న ప్రదేశాలు ప్రజల ఆవాసా కేంద్రాల్లో మద్యం షాపులు నిర్వహించరాదన్నారు. మద్యానికి బానిసై మతిచెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని అన్నారు. సంపూర్ణ మద్యపానం నిషేధించకపోయినా, నియంత్రణ చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే దశలవారి పోరాటాలకు శ్రీకారం చుడదామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల జేఏసీ నాయకులు చంద్రిక, రామాంజినమ్మ, అరుణమ్మ, సరస్వతి, అనిత, లక్ష్మీదేవి, చంద్రకళ పాల్గొన్నారు.

➡️