హామీల అమలుకు ప్రజలే నడుం బిగించాలి

హామీల అమలుకు ప్రజలే నడుం బిగించాలి

విలేకరులతో మాట్లాడుతున్న వెంకటరామిరెడ్డి

ప్రజాశక్తి-అనంతపురం

ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రజలే నడుం బిగించాలని వైసిపి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం వైసిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హామీలు ఇవ్వడం..అధికారంలోకి వచ్చాక కాలం వెళ్లదీయడం చంద్రబాబుకు అలవాటేనని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వానికి ఆరు నెలల హనీమూన్‌ పిరియడ్‌ ముగిసిందని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలిపారు. ముఖ్యంగా ‘సూపర్‌ సిక్స్‌’ పేరుతో అధికారంలోకి వచ్చి హామీల అమలును విస్మరించడం బాధాకరమన్నారు. చంద్రబాబు కేవలం మాటలకే పరిమితం అవుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచి హామీలను అమలు చేసేలా చేయాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ ముగిసి అతివృష్టి, అనావృష్టితో పంటలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. కనీస దిగుబడులు రాని పరిస్థితి వచ్చిందన్నారు. జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితులు వస్తే ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా అందచేవాళ్లమన్నారు. అదే చంద్రబాబు ప్రభుత్వం మాటలకే పరిమితం అవుతోందని మండిపడ్డారు. జిల్లాలో వాస్తవ పరిస్థితులకు భిన్నంగా అధికార యంత్రాంగం నివేదికలు పంపుతోందని విమర్శించారు. రైతుల బాధలు వర్ణణాతీతంగా ఉన్నా ఎన్నికల ముందు హామీ ఇచ్చిన అన్నదాన సుఖీభవ ఏదీ?అని నిలదీశారు. అలాగే పంటలకు మద్దతు ధర అని ఆర్భాటంగా ప్రకటించిన చందబ్రాబు ఏదీ మద్దతు ధర.. అంటూ ప్రశ్నించారు. వరి ధాన్యం కోనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరిస్తామని సాక్షాత్తూ సివిల్‌ సప్లర్సు శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారని, కానీ ఇప్పటి వరకు కేవలం 4.50 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సేకరించారన్నారు. ఇకపోతే జిల్లాలో అరటి రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గతేడాది అరటి (తొలి కొయ్య) టన్ను రూ.25 వేల నుంచి 28 వేలు ఉంటే ఈ ఏడాది కేవలం రూ.17 వేల నుంచి రూ.19 వేలు పలుకుతోందన్నారు. రైతులు కష్టాల్లో ఉంటే పట్టించుకునే ప్రజాప్రతినిధులు కరువయ్యారని అనంత మండిపడ్డారు. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు వారి లోకంలో వాళ్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. అలాగే వ్యవసాయ సీజన్‌ ప్రారంభం అయ్యాక విత్తనాలు,ఎరువులపై నిఘా ఉంచాల్సిన అధికార యంత్రాంగం నిద్రమత్తులో ఉందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక, మట్టి, మద్యం, బూడిద అమ్మకాలపైనే ఎమ్మెల్యేలు దృష్టి సారించారు తప్ప.. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఇకపోతే హంద్రీనీవా సామర్థ్యాన్ని 6200 క్యూసెక్కులకు చేయడంతోనే రాయలసీమకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మళ్లీ 3850 క్యూసెక్కులకే పరిమితం చేయడం తగదన్నారు. దీని వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుందని, డీఆర్‌సీ సమావేశంలో తీర్మాణం చేసి ప్రభుత్వానికి పంపాలని కోరారు.

➡️