విప్ కాలవ శ్రీనివాసులుకు సమస్యలను వివరిస్తున్న సిఐటియు నాయకులు మల్లికార్జున
ప్రజాశక్తి-రాయదుర్గం
రాయదుర్గం పురపాలక సంఘంలో పని చేస్తున్న ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున కోరారు. ఈమేరకు శుక్రవారం స్థానిక విప్ కాలవ శ్రీనివాసులు నివాసంలో కార్మికులతో కలిసి విప్‌నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పురపాలక సంఘాన్ని నమ్ముకుని ఇంజినీరింగ్ కార్మికులు చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కార్మికుల జీవితాలు మాత్రం మారడం లేదన్నారు. ఈనేపథ్యంలో కుటుంబాలను పోషించుకోలేని క్లిష్ట పరిస్థితుల్లో ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. నిత్యం ప్రమాదకర పరిస్థితులలో పనిచేసే ఇంజనీరింగ్ కార్మికులకు కేవలం రూ.15వేల నెలసరి వేతనంతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారన్నారు. కావున ఇంజినీరింగ్ కార్మికులకు జీవో 36 ప్రకారం కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని, వారి ఉద్యోగం క్రమబద్ధీకరణ చేసేలా వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. అందుకు స్పందించిన విప్ కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ కచ్చితంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తిప్పేరుద్ర, నాయకులు నరసింహులు, మైలారి, గోపాల, ఇస్మాయిల్, సీనప్ప, కిరణ్, ఓబన్న, పారిశుధ్య విభాగం నాయకులు మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.