ఇంటి పైకప్పులు కూలి ఐదుగురు మృతి

  • అనంతపురంలో దంపతులతోపాటు చిన్నారి
  • సత్యసాయి జిల్లాలో ఇద్దరు రైతులు

ప్రజాశక్తి – కుందుర్పి, చిలమత్తూరు : వేర్వేరు ఘటనలో ఇంటి పై కప్పులు కూలి ఐదుగురు మృతి చెందారు. అనంతపురం జిల్లాలో దంపతులతో పాటు చిన్నారి మృతి చెందారు. సత్యసాయి జిల్లాలో వ్యవసాయ తోట వద్ద నిర్మాణం చేపడుతున్న ఇంటి పైకప్పు కూలి ఇద్దరు రైతులు మరణించారు. ఈ రెండు సంఘటనలతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామానికి చెందిన గంగన్న (43), శ్రీదేవి (38) దంపతులకు కుమార్తె సంధ్య (14), కుమారుడు ఉన్నాడు. కుమారుడు అనంతపురంలోని ఓ కాలేజీ హాస్టల్లో ఉంటూ ఇంటర్‌ చదువుతుండగా కుమార్తె తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఇటీవల కురిసిన వర్షాలకు వీరి చౌడు మిద్దె నానిపోయి మంగళవారం అర్ధరాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. పైకప్పు వీరి ముగ్గురిపై పడడంతో వారంతా అందులో కూరుకుపోయారు. బుధవారం ఉదయం తమ కుమారుడు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి గంగన్న తల్లి వెళ్లి చూడగా తలుపులు మూసి ఉన్నాయి. కిటికీలోనుంచి చూడగా ఇంటి పైకప్పు కూలిన విషయాన్ని గమనించి చుట్టుపక్కల వారి సాయంతో లోపలికి వెళ్లి చూడగా అప్పటికే గంగన్న, శ్రీదేవి, సంధ్యలు మట్టిలో కూరుకుపోయి మృతి చెందారు.

శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన రైతు శివారెడ్డి (50) తన పొలంలో పొగాకు పంట సాగు, కాపలాకు అనుకూలంగా ఉండేలా పొలంలోని ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఇంటి పై భాగాన కాంక్రీటు వేస్తుండగా ఒక్కసారిగా స్లాబు కొంతమేర కిందికి కుంగింది. శివారెడ్డి, ఆయన కుమారుడు రాజశేఖర్‌రెడ్డి, రైతు లక్ష్మినారాయణ రెడ్డి (45) కలిసి స్లాబ్‌ కింద భాగంలో కర్రలను అమరుస్తుండగా ఒక్కసారిగా స్లాబ్‌ మొత్తం వారిపై కూలిపోయింది. లక్ష్మినారాయణరెడ్డి అక్కడికక్కడే మరణించారు. తీవ్ర గాయాలైన శివారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డిని బెంగళూరుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో శివారెడ్డి మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మంత్రి లోకేష్‌ ఆరా

రుద్రంపల్లి ఘటన విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శబరిమల యాత్రలో ఉన్న ఆయన ఘటనపై స్థానిక టిడిపి నాయకులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులను గ్రామానికి పంపి సహాయక చర్యలు చేపట్టేలా ఆదేశించారు. ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఆరా తీశారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబుతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఘటన వివరాలను తెలుసుకుని బాధిత కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు.

➡️