పారదర్శకంగా మద్యం అమ్మకాలు : మంత్రి కొల్లు రవీంద్ర

సోములదొడ్డి వద్ద ఐఎంఎఫ్‌ఎల్‌ డిపోను ప్రారంభిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాణ్యమైన మద్యంతో పారదర్శకంగా అమ్మకాలు కొనసాగిస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్‌, గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అనంతపురం రూరల్‌ మండలం సోములదొడ్డి గ్రామంలో రూ.11.10 కోట్లతో నూతనంగా నిర్మించిన ఐఎంఎఫ్‌ఎల్‌ డిపో గోడౌన్‌ను గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు, అనంతపురం, మడకశిర, శింగనమల ఎమ్మెల్యేలు పరిటాల సునీత, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌, ఎమ్మెస్‌.రాజు, బండారు శ్రావణి శ్రీ, పొలిటికల్‌, రెవెన్యూ, ఎక్సైజ్‌ శాఖల ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ముఖేష్‌ కుమార్‌ మీనా, ఎపిఎస్‌బిసి లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, డిస్టర్లరీస్‌, బ్రేవెరీస్‌ కమిషనర్‌ నిశాంత్‌ కుమార్‌ రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డైరెక్టర్‌ రాహుల్‌ దేవ్‌ శర్మ, జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి పెద్దపేట వేస్తూ, నాణ్యమైన మద్యం విక్రయాలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా 3500 మద్యం దుకాణాల కేటాయింపు జరిగిందన్నారు. గోడౌన్‌ నుంచి వెళ్లే ప్రతి స్టాకు వాహనాన్ని ట్రాక్‌ చేస్తున్నామన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని అరికట్టడం ద్వారా రాష్ట్రంలో 30 నుంచి 40 శాతం అమ్మకాలు పెరిగాయన్నారు. మద్యం దుకాణాల్లో డిజిటల్‌ చెల్లింపులను అమలు చేస్తున్నామన్నారు. మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వారు ఎవరైనా బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే షాపు లైసెన్సులు రద్దు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం ఎక్సైజ్‌ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కొత్తకొత్త పేర్లతో నాసిరకం మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేసిందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కొనుగోళ్ల అక్రమాలన్నీ వెలికి తీస్తున్నామని చెప్పారు. మద్యం అక్రమాలను నిగ్గుతేల్చడానికి సిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. మద్యం స్కాంలో బాధ్యులైన వారు ఎవరూ తప్పించుకోలేరని చెప్పారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ గోడౌన్‌లో హమాలీల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టులో ఉన్న భూ సమస్యను అధికారులు తాము కలిసి పరిష్కరిస్తామన్నారు. మరో ఐదు కోట్లు నిధులు మంజూరు చేస్తే పూర్తిస్థాయి గోడౌన్‌ తయారవుతుందన్నారు. అనంతరం మంత్రికి పరిటాల సునీత జ్ఞాపికలను బహుకరించారు. గోడౌన్‌ హమాలీలకు యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కమిషనర్‌ అనసూయ దేవి, ఎపిఎస్‌బి లిమిటెడ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ శ్రవణ్‌ కుమార్‌, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య, అసిస్టెంట్‌ కమిషనర్‌ మునుస్వామి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ డి.రామ్మోహన్‌ రెడ్డి, అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు పాల్గొన్నారు.

➡️