బదిలీల కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న ఎస్పీ జగదీష్
ప్రజాశక్తి-అనంతపురం క్రైం
పారదర్శకత, నిబంధనలే ప్రామాణికాలుగా తీసుకుని సీనియార్టీ ఆధారంగా సిబ్బంది కోరుకున్న చోటుకే శుక్రవారం స్థాన చలనం చేశారు. శుక్రవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో 30 మంది ఏఎస్సైలకు, 79 మంది హెడ్ కానిస్టేబుళ్లకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించి బదిలీ చేశారు. ఒకే పోలీసు స్టేషన్లో ఐదు సంవత్సరాలు పూర్తీ చేసుకున్న సిబ్బంది జాబితాను సిద్ధం చేసి కౌన్సెలింగ్ కు పిలిచారు. ముందుగా ఒకే చోట ఐదేళ్లు పూర్తీ చేసుకున్న సీనియార్టీ జాబితాను ప్రొజెక్టర్ పై ప్రదర్శింపజేశారు. జిల్లాలో ఉన్న సిబ్బంది ఖాళీలను అందులో చూయించారు. గతంలో పని చేసిన పోలీసు స్టేషన్ల వివరాలు కల్గిని ప్రతిని కూడా అందజేశారు. బదిలీల ప్రక్రియకు కొలమానమైన నిబంధనలు సిబ్బందికి ఎస్పీ స్పష్టంగా వివరించారు. అనంతరం సీనియార్టీ ప్రకారం నిబంధనలు అనుసరించి సిబ్బంది కోరుకున్న చోటుకి బదిలీ చేశారు. ఇందులో నిబంధనలు పక్కాగా అమలు చేశారు. పట్టణాలలో పని చేస్తున్న వారిని రూరల్ పోలీసు స్టేషన్లకు రూరల్ ఏరియాలలో పని చేస్తున్న వారిని పట్టణ ప్రాంతాల పోలీసు స్టేషన్లకు బదిలీ చేశారు. అదే నియోజకవర్గం కాకుండా ఇతర నియోజకవర్గాల్లోని పోలీసు స్టేషన్లకు అవకాశం కల్పించారు. ఇలా 30 మంది ఏఎస్సైలకు, 79 మంది హెడ్ కానిస్టేబుళ్లకు బదిలీ చేస్తూ అక్కడికక్కడే బదిలీ ఉత్తర్వు డి.ఒ ప్రతిని సిబ్బంది చేతికి అందజేయడం విశేషం. నేటివిటీ, సర్వీసు పర్టికులర్స్ నందు సందేహాలున్న వారికి అక్కడికక్కడే సంబంధిత డి.పి.ఒ సిబ్బంది చే నివత్తి చేసి కౌన్సెలింగ్ జరిపారు. బదిలీల ప్రక్రియ యావత్తు పారదర్శకంగా జరగడంతో సిబ్బంది సంతప్తి చెందారు. ఈ బదిలీల కౌన్సెలింగ్ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డి.వి.రమణమూర్తి , జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ, సూపరింటెండెంట్లు మరియు సిబ్బంది, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసుల నాయుడు, శివప్రసాద్, లక్ష్మినారాయణ, శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ర్యాంకు ఏ.ఎస్ .ఐ లు, హెడ్ కానిస్టేబుళ్లకు పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించడంపై జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ ఆధ్వర్యంలో సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.