కేంద్ర హోంమంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పాలి

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పాలి

నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు

ప్రజాశక్తి-ఉరవకొండ

పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు వై.మధుసూదన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అమిత్‌షా వ్యాఖ్యల ను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక ఆర్‌అండ్‌బి బంగ్లా వద్ద నుంచి అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల అభివృద్ధి కోసం తన జీవితాన్నే ఫణంగా పెట్టి దేశానికి మహోన్నతమైన రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్‌ను కించపరిచే విధంగా మాట్లాడటం దౌర్భాగ్యమన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని కేవలం స్వార్థ రాజకీయాలు, మత రాజకీయాలు పెంపొందించుకోవడానికి ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు క్షమించరన్నారు. ప్రజాస్వామ్య విధానాలను కాలరాస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలను దేశ ప్రజలపై బలవంతంగా రుద్దే విధంగా ప్రయత్నాలు చేస్తున్న బిజెపిని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బ్యాళ్ల శివప్రసాద్‌, జిల్లా కార్యదర్శి సోనియా సీనా, మైనార్టీ వింగ్‌ రాష్ట్ర నాయకులు అబ్బాస్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️