కలెక్టరేట్ వద్ద మహాధర్నాలో పాల్గొన్న రైతు, కార్మిక సంఘాల నాయకులు
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
రైతు, కార్మిక వ్యతిరేక విధనాలను నిరసిస్తూ దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా అనంతపురం జిల్లా కేంద్రంలో కార్మిక, రైతు, వ్యవసాయ, కూలీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నాను చేపట్టారు. సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు, ఎపి రైతుసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కార్మికులు, రైతులు, కూలీలు, మహిళలు పెద్దఎత్తున లలితికళా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేపట్టారు. కలెక్టరేట్ వద్ద బైటాయించి మహాధర్నా కొనసాగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధనాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైతు, కార్మికులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
రైతు, కార్మికులను విస్మరించిన మోడీ
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు
పదేళ్ల బిజెపి పాలనలో రైతులు, కార్మికులను విస్మరిస్తూ, వారికి అన్యాయం చేసేలా నిర్ణయాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ పాలన కొనసాగుతోందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు విమర్శించారు. కలెక్టరేట్ వద్ద మహాధర్నా సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టేది రైతులు, సంపద సృష్టించేది కార్మికులన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రతరం చేసి వారిని ఇబ్బందుల పాలుజేస్తోందన్నారు. రైతాంగాన్ని సర్వనాశనం చేయడానికి మూడు వ్యవసాయ నల్ల చట్టాలు తెచ్చిందన్నారు. వీటిని వ్యతిరేకిస్తూ రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే అప్పడు ప్రధాని వెనక్కు తగ్గి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటన చేశారన్నారు. ఉద్యమ సమయంలో రైతులు లేవనెత్తిన డిమాండ్లనూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నా ప్రధాని వాటిపై నోరుమెదపకపోవడం రైతులకు ద్రోహం చేయడమే అన్నారు. బిజెపి ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో కార్పొరేట్లకు 19.28 లక్షల కోట్ల రుణమాఫీ, పన్ను రాయితీ, ప్రోత్సాహకాల పేరుతో ప్రజల ధనాన్ని దోచిపెట్టిందని విమర్శించారు. అపులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా రైతాంగానికి కనీస మద్దతు ధర చట్టం చేయలేకపోవడం విచాకరం అన్నారు. స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తూ రైతులను మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. కరువు జిల్లా అనంతపురం అభివృద్ధిపై పాలకుల నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉందన్నారు. జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించకుండా అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చిందన్నారు. పెట్టుబడిదారులకు మేలు చేస్తూ కార్మికులకు అన్యాయం చేసేలే లేబర్ కోడ్‌లను తెచ్చారన్నారు. వివిధ ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పినా అమలుకు నోచుకోలేదన్నారు. ఆశ, అంగన్వాడీ, స్కీం కార్మికులు, మధ్యాహ్నం భోజన కార్మికులకు పని భద్రత లేదన్నారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయకుండా ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయని విమర్శించారు. విశాఖ ఉక్కును ప్రయివేటు పరం చేసేందుకు బిజెపి కుట్ర చేస్తోందన్నారు. రైతు, కార్మిక వ్యతిరేక విధనాలను నిరసిస్తూ ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్ర కుమార్, గోపాల్, వెంకట్ నారాయణ, మన్నీల రామాంజనేయులు, ముర్తుజా, శ్రీనివాసులు, నాగభూషణం ఎటిఎం.నాగరాజు, శివప్రసాద్, జగన్మోహన్ రెడ్డి, రమాదేవి, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, చంద్రశేఖర్ రెడ్డి, బాల రంగయ్య, కృష్ణమూర్తి, ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, మల్లికార్జున, చెన్నప్ప యాదవ్, ఎఐటియుసి నాయకులు రాజేష్ గౌడ్, రాజారెడ్డి, కష్ణుడు చిరంజీవి, ఐఎఫ్‌టియు ఏసు రత్నం, సురేష్ బాబు, ఇండ్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.