ఇజ్రాయిల్‌ దాడులతో అశాంతి

శాంతిర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

పాలస్తీనా దేశంపై ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న యుద్ధ దాడులు తీవ్ర అశాంతిని రేకిత్తిస్తూ, అమాయక ప్రజల ప్రాణాలను బలిగొట్టుకున్నాయని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. పాలస్తీనాపై జరుగుతున్న యుద్ధం దాడిని ఆపాలని కోరుతూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో సోమవారం నాడు శాంతిర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ భవన్‌ నుంచి సిపిఎం నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తెలుగుతల్లి కూడలి వరకు శాంతిర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ యుద్ధం ప్రారంభించి ఏడాది అవుతోందన్నారు. యుద్ధంలో భీకర దాడులతో ప్రజలు ప్రాణాలు బలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 44 వేల మంది చనిపోయినట్లు తెలుస్తోందన్నారు. మరణించిన వారిలో ఏడు వేల మంది చిన్న పిల్లలు ఉండడం అత్యంత విచారకరమైనదన్నారు. అమెరికా అండదండలతో ఇజ్రాయిల్‌ దుర్మార్గంగా పాలస్తీనాపై దాడులు చేస్తోందని మండిపడ్డారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్య వాదులంతా ఈ దాడులను ఖండించాలని కోరారు. ప్రస్తుతం పాలస్తీనా భూభాగం అంతా ఇజ్రాయిల్‌ ఆక్రమణలోకి వెళ్లిందన్నారు. పాలస్తీనా దేశం ఏర్పడితేనే న్యాయమైన పరిష్కారం దొరుకుతుందన్నారు. ఐక్యరాజ్యసమితి స్పందించి ఇజ్రాయిల్‌ దాడులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ గోవిందరాజులు మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదులు తమ ఆయుధాలను అమ్ముకోవడానికి యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ఐక్యతను కాపాడే ఐక్యరాజ్యసమితి ప్రేక్షకపాత్రలో ఉండడం సరికాదన్నారు. పాలస్తీనాపై జరుగుతున్న యుద్ధాన్ని ఆపించేలా ప్రపంచ దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప మాట్లాడుతూ ఇజ్రాయిల్‌ దుర్మార్గంగా చిన్న దేశాలపై దాడులు చేసి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుందని విమర్శించారు. దీన్ని ప్రజాస్వాములు అంత ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బాల రంగయ్య, వి.సావిత్రి, మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు షేకన్న, యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు రమణయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆర్‌వి.నాయుడు, ఎం.నాగమణి, మన్నీల రామాంజనేయులు, వై.వెంకట నారాయణ, నగర నాయకులు వలీ, నూరుల్లా, చంద్రిక, ఐలు జిల్లా అధ్యక్షులు సతీష్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రసన్న, అశోక్‌, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిద్ధూ, పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️