ఓపీఎస్‌ను అమలు చేయాల్సిందే..! : యుటిఎఫ్‌

అనంతపురం డిఇఒ కార్యాలయం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలుపుతున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ స్కీం(ఓపిఎస్‌)ను అమలు చేయాల్సిందే అని యుటిఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరుతూ శుక్రవారం నాడు జిల్లాలోని తాలూకా, డివిజన్‌ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఆయా తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టిన అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అనంతపురం డిఇఒ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీం(యుపిఎస్‌), గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌(జిపిఎస్‌), కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సిపిఎస్‌) తదితర వాటిని అన్నింటినీ రద్దుచేసి పాత పెన్షన్‌ విధానం(ఓపిఎస్‌)ను మాత్రమే అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు పెన్షన్‌ బిక్ష కాదు హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాలకపక్షాలు గుర్తించాలన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం యునిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ తీసుకు రావడం దారుణమన్నారు. అసంబద్ధమైన పని సర్దుబాటును రద్దు చేయాలని కోరారు. తక్కువమంది విద్యార్థులు ఉన్న పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను పని సర్దుబాటు మండల స్థాయిలో సులువగా చేయాల్సిన పనిని ఆన్‌లైన్‌ పేరుతో కఠినతరం చేశారని మండిపడ్డారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరప్ప మాట్లాడుతూ ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్‌ టీచర్స్‌కు మార్చాలనే కారణంతో ఎసిటిలను బలవంతంగా పని సర్దుబాటు చేసారని చెప్పారు. గత ప్రభుత్వం జీవో 117 ద్వారా ప్రాథమిక పాఠశాలలని విచ్ఛిన్నం చేస్తే ఇప్పుడు పని సర్దుబాటు పేరుతో ప్రాథమిక పాఠశాలలను బలహీన పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా అన్ని స్థాయిల్లో జరిగిన పని సర్దుబాటును సవరించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకు మెడికల్‌ రెప్స్‌ అసోసియేషన్‌ నాయకులు శ్రీనివాసులు, లాయర్స్‌ అసోసియేషన్‌ నాయకులు సతీష్‌ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు రమణయ్య, సరళ, దేవేంద్రమ్మ, సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ, రామాంజినేయులు మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు ఎర్రిస్వామి, రామాంజనేయులు పాల్గొన్నారు.

➡️