కలెక్టర్‌కు సమస్యలను వివరిస్తున్న సిపిఎం మండల కార్యదర్శి నిర్మల
ప్రజాశక్తి-గుత్తి
పట్టణ శివారులో ఉన్న జెడ్ వీరారెడ్డి కాలనీలో కనీస మౌలిక వసతులు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినోద్‌కుమార్ హామీ ఇచ్చారు. గురువారం స్థానిక జెడ్ వీరారెడ్డి కాలనీని కలెక్టర్ సందర్శించి తాగునీటి ట్యాంకుతోపాటు సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి వి.నిర్మల, కాలనీవాసులు జెడ్.వీరారెడ్డి కాలనీలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 68 మందికి కాలనీలో ఇంటి పట్టాలు ఇవ్వాలని గుత్తి నుంచి అనంతపురం కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి అర్జీలు ఇచ్చామని గుర్తు చేశారు. కాలనీకు ప్రధాన రహదారి లేదన్నారు. విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. కాలనీలో చిన్నారుల అధికంగా ఉన్నారని వారి కోసం అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, శ్రీ సత్యసాయి మంచినీటి ప్రాజెక్టు నుంచి తాగునీరు సరఫరా చేయాలని విన్నవించారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ జెడ్ వీరారెడ్డి కాలనీలో మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తామన్నారు. కాలనీలో ఇంటి పట్టాల సమస్యను పరిష్కరించాలని తహశీల్దార్ డి.ఓబిలేసును ఆదేశించారు. కాలనీకు మంచినీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని మున్సిపల్ కమిషనర్ బి.జబ్బార్ మియా, డిఇ హేమచంద్రకు ఆదేశాలు జారీ చేశారు. సామాజిక పింఛన్ల సమస్య పరిష్కరించాలని డిఎల్ పిఓ విజయలక్ష్మికి సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడ నుంచి బసినేపల్లి గ్రామానికి వెళ్లారు. ఆయన ఎంపిడిఒ డి.ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.