రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న వి.సావిత్రి
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రవేశపెట్టనున్న నూతన మద్యం పాలసీ విధానం మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చేలా ఉందని, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడే ఈ విధానాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని మహిళ, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ ‘మద్యం ఆదాయ వనరా.. ప్రజా సంక్షేమమా’..! అన్న అంశంపై ఐద్వా ఆధ్వర్యంలో శనివారం ఉదయం చర్చ వేదిక నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి అధ్యక్షతన స్థానిక ఎన్జీహోంలో నిర్వహించిన చర్చా వేదికలో రెడ్స్ సంస్థ అధ్యక్షురాలు భానుజా, ఇన్నర్ వీల్స్ క్లబ్ అధ్యక్షురాలు శ్రీవల్లి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పార్వతి ప్రసాద్, ప్రగతి శీల మహిళా సంఘం అధ్యక్షురాలు సరస్వతి, కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప, ఆవాజ్ జిల్లా అధ్యక్షులు వలి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల, జిల్లా కోశాధికారి చంద్రిక, జిల్లా ఉపాధ్యక్షురాలు రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి.సావిత్రి మాట్లాడుతూ ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చేందుకు నూతన మద్యం పాలసీని తీసుకొస్తున్నట్లు ఉందన్నారు. కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీ అంటూ వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రయివేటు వ్యక్తులతో అమ్మకాలు చేసేందుకు సిద్ధం అవుతోందన్నారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామంటూ ప్రభుత్వం చెప్పడం చూస్తుంటే రానున్న రోజుల్లో మద్యం ఏరులైపారే పరిస్థితులు కన్పిస్తున్నాయన్నారు. నూతన మద్యం పాలసీపై ప్రభుత్వం పునరాలోచించి, ప్రభుత్వమే మద్యం విక్రయించాలన్నారు. రెడ్స్ సంస్థ అధ్యక్షురాలు భానుజా మాట్లాడుతూ పేద, మధ్య తరగతి కుటుంబాల జీవనం సాఫీగా సాగాలంటే మద్యం నియంత్రణే మార్గం అన్నారు. సమాజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించాలని కోరారు. కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప మాట్లాడుతూ ప్రయివేటు వ్యక్తుల ద్వారా మద్యం విక్రయాలు జరిపితే అమ్మకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతాయన్నారు. గ్రామాల్లో బెల్డ్‌షాపులను ప్రోత్సహించి అమ్మకాలు చేస్తారన్నారు. మద్యం నియంత్రణకు ప్రస్తుతం ఉన్న షాపుల్ని చాలా వరకు తగ్గించాలని కోరారు. ఇన్నర్ వీల్స్ క్లబ్ అధ్యక్షురాలు శ్రీవల్లి మాట్లాడుతూ ప్రతి మద్యం అలవాటు చాలా ప్రమాదకరం అని, దానికి దూరంగా ఉండాలన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే నిర్ణయాలపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. ఆవాజ్ జిల్లా అధ్యక్షులు వలి మాట్లాడుతూ మద్యపాన నిషేధం కోసం గతంలో ఐద్వా, యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి అనేక షాపులను మూసి వేయించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న జనావాసాల మధ్య ఉన్న షాపులను ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని చెప్పారు. ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పార్వతి ప్రసాద్ మాట్లాడుతూ బడి, గుడి జనావాసాల మధ్య మద్యం షాపులు నిర్వహించరాదని కోరారు. బెల్టుషాపులు ఏర్పాటు చేస్తే వాటిపై పోరాటం సాగిస్తామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ మద్యపానానికి బానిసలై మతిచెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. మద్యపానం పర్యావసనాలపై ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సరస్వతి, ఐద్వా నాయకులు అరుణమ్మ, ప్రజానాట్యమండలి కష్ణవేణి, మహిళా సమాఖ్య నగర కార్యదర్శి జానకి, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు అనిత, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్, జెవివి, సమత నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మద్యం నియంత్రణకు తీర్మానాలు..
నిరసనలుచర్చా వేదిక సందర్భంగా వక్తలు పలు తీర్మానాలు చేశారు. ప్రభుత్వమే మద్యం విక్రయించాలని, టెండర్ విధానం రద్దు చేయాలని, మద్యం విక్రయాల సమయం పెంచకుండా కుదించాలని, మద్యం పూర్తిగా నిషేధించకపోయినా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానాలు చేశారు. నూతన మద్యం విధానం ఉపసంహరించుకోవాలని కోరుతూ మహిళ, ప్రజా, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా సంపూర్ణ మద్యపాన నిషేధం జరగాలని కోరుతూ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.