వినతిపత్రం అందజేస్తున్న సిఐటియు నాయకులు
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్
మున్సిపల్ కార్పొరే షన్‌లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు అనుబంధ మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక పరిష్కార కార్యక్రమంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎటిఎం నాగరాజు, కె.నాగభూషణ మాట్లాడుతూ నగరపాలక సంస్థలో 20ఏళ్లకుపైగా కార్మికులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. అయినా వారికి కనీసం ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించకపోవడం బాధాకరమన్నారు. తద్వారా కార్మికులు అనారోగ్యాలకు గురైనప్పుడు సరైన వైద్యం పొందలేకపోతున్నారన్నారు. మెరుగైన వైద్యం చేయించుకోలేక చాలామంది కార్మికులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కార్మికులకు ఇప్పటి వరకూ ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని కోరారు. అదేవిధంగా పారిశుధ్య విభాగానికి సంబంధించిన క్లర్క్-ఎఫ్1కు, కంప్యూటర్ ఆపరేటర్‌కు సరైన అవగాహన లేకపోవడం వల్ల కార్మికుల సమస్యలు కుప్పలుతెప్పలుగా మిగిలిపోతున్నాయన్నారు. కావున వారి స్థానంలో అనుభవజ్ఞులైన క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించాలని కోరారు. అలాగే కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని, ఇపిఎఫ్‌ను జమ చేయాలని, డిమాండ్ చేశారు. ఆయా సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నగర కార్యదర్శి సాకే తిరుమలేష్, రెగ్యులర్ యూనియన్ నాయకులు ముత్తురాజు, ఇంజినీరింగ్ సెక్షన్ నాయకులు రాయుడు, పోతలయ్య, మురళీ, జిల్లా కోశాధికారి బత్తల ఆదినారాయణ, నగర ఉపాధ్యక్షులు శేషేంద్రకుమార్, రెగ్యులర్ యూనియన్ సభ్యులు ఆనంద్, నగర మహిళా కన్వీనర్ మంత్రి వరలక్ష్మి, కమిటీ సభ్యులు కిరణ్, లక్ష్మయ్య, మరియమ్మ, బంగ్లా రాఘవేంద్ర, ప్రసాద్, ఆదినారాయణ, రవి, హరి, కుమార్, నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.