ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : గజపతినగరం ప్రాజెక్టు పరిధి రామన్నపేటలో అక్రమంగా తొలగించిన అంగన్వాడీ హెల్పర్ మానాపురం సౌజన్యను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బుధవారం మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనసూయ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామన్నపేట గ్రామ సర్పంచ్ అరుణ కుమారి చేసిన రాజకీయ వేధింపుల్లో భాగంగా సౌజన్యను తొలగించాలని ఐసిడిఎస్ పిఓ పైన ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. సౌజన్యకు ఉద్యోగం ఇచ్చినప్పుడు అన్ని విధాలా ఆమె సర్టిఫికెట్లన్నీ పరిశీలించారని, అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ మంత్రి స్పందించి సౌజన్యను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పీడీ, సిడిపిఒలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీక్షలకు పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు, మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహన్‌రావు, మెడికల్ సేల్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి యూఎస్ రవికుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సుధారాణి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆర్.ఆనంద్ మాట్లాడుతూ అక్రమంగా తొలగించిన సౌజన్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీక్షల్లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు వి.లక్ష్మి, జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు, జిల్లా కమిటీ సభ్యులు మాలతి, వరలక్ష్మి, ధనలక్ష్మి, పలువురు కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.