ధర్నాకు వెళ్లకుండా అంగన్వాడీలకు అడ్డంకులు

Mar 11,2025 00:15

మాచర్ల తహశీల్ధార్‌కు వినతిపత్రం ఇస్తున్న అంగన్వాడీలు, యూనియన్‌ నాయకులు
ప్రజాశక్తి – మాచర్ల :
చలో విజయవాడ వెళుతున్న అంగన్వాడీలపై నిర్బంధాలు పెట్టారు. సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు, ఆంధ్రప్రదేశ్‌ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలోని ధర్నా చౌక్‌లో మహాధర్నాకు పిలుపునిచ్చాయి. అతి తక్కువ వేతనాలతో మాతాశిశు సంక్షేమ రంగంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ ఉత్తర్వులు సవరించడం, మిని సెంటర్లు మెయిన్‌ సెంటర్లుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ, 42 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలని, తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మహాధర్నాను చేపట్టారు. మహాధర్నాలో పాల్గొనేందుకు విజయవాడకు వెళ్లే అంగన్వాడీలను సోమవారం స్థానిక సిడిపిఒ, సూపర్‌వైజర్లు ఇబ్బందులు పెట్టి అడ్డుకున్నారు. దాంతో అంగన్వాడీలు నిరసన తెలియజేస్తు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బండ్ల మహేష్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయాంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె చేశారన్నారు. ఆ సందర్భంగా ప్రభుత్వానికి, యూనియన్‌కు మధ్య కొన్ని ఒప్పందాలు జరిగాయని, ఆ ఒప్పందాల అమలు, మిగిలిన సమస్యలు పరిష్కారం కోసం చలో విజయవాడకు వెళ్లేందుకు యూనియన్‌ ఆధ్వర్యంలో జిల్లా, రాష్ట్ర కార్యాలయాలతో పాటు స్థానిక సిఐటియు కార్యాలయంలో కూడా మూకుమ్మడి సెలవు ధరఖాస్తులను అంగవ్వాడీలు ఇచ్చారని తెలిపారు. స్థానిక సిడిపిఒ, సూపర్‌వైజర్లు వీళ్లను విజయవాడకు పోకుండా అడ్డుకునేందుకు అనధికార సెక్టార్‌ సమావేశాలు ఏర్పాటు చేసి, సమావేశానికి రాకపోతే షోకాజు నోటీసులు ఇస్తామంటూ బెదిరించారని చెప్పారు. కార్మికులకు, ఉద్యోగులకు తమ సమస్యల పరిష్కారం కోసం శాంతీయుతంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించే హక్కు ఉందని, రాజ్యాంగం కల్పించిన ఆ హక్కులను అధికారులు కాలరాయటం అన్యాయమని విమర్శించారు. విజయవాడకు పోలేని అంగన్వాడీ వర్కర్లు సిడిపివో కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తుండగా అక్కడ కూడా ఉండటానికి వీళ్లేందంటూ వెళ్లిపోవాలంటూ సిడిపివో సూపర్‌వైజర్ల ద్వారా చెప్పించటంతో వారందరూ తహశీల్దార్‌ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు. ఈ మేరకు సిడిపివో, సూపర్‌వైజర్లపై తహసిల్దార్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు శోభన్‌కుమార్‌, అంగన్వాడి యూనియన్‌ నాయకులు ఉషా, గోవిందమ్మ, సైదమ్మ, విజయ, రంగమ్మ, సువార్త, సిద్ధమ్మ పాల్గొన్నారు. జ్రాశక్తి – వినుకొండ : తమ సమస్యలను పరిష్కరించాలని తహశీల్దార్‌ కార్యాలయంలో అంగన్వాడీలు వినతిపత్రం ఇచ్చారు. యూనియన్‌ నాయకులు ప్రసన్నాంబ మాట్లాడుతూ పేద గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్స్‌ అనేక సేవలు అందిస్తున్నారు. అంగనవాడి సెంటర్ల నిర్వహణకు రకరకాల పెట్టుబడులు పెట్టి సెంటర్లో నిర్వహిస్తున్నారని చెప్పారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని చెప్పారు. గతంలో సమ్మె సందర్భంగా 2024 జులైలో వేతనాలు పెంపు ఇతర సమస్యల పరిష్కారం చేస్తానని అప్పటి ప్రభుత్వం చెప్పిందని, చనిపోతే మట్టి ఖర్చులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పగా రూ.15 వేలే ఇచ్చారని, ఇతర అంశాలపై జీవోలను ఇవ్వలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలు సందర్భంగా కూటమి ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో షేక్‌ షకీల, షేక్‌ మున్నీ, ఉమా శంకరి, నీరజ, పద్మ, నీలిమ పాల్గొన్నారు.

వినుకొండ తహశీల్ధార్‌కు వినతిపత్రం ఇస్తున్న అంగన్వాడీలు, యూనియన్‌ నాయకులు

➡️