కదం తొక్కిన అంగన్‌వాడీలు

Jan 11,2025 00:09

పీడీకి సమస్యలు వివరిస్తున్న నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు :
అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారానికి ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పీడీ కార్యాలయాన్ని అంగన్‌వాడీలు ముట్టడించారు. నాలుగు రోజులుగా కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా అధికారులు స్పందించి చర్చలు జరకపోవటంతో పీడీ కార్యాలయాన్ని ముట్టడించారు. తొలుత కలెక్టరేట్‌ నుండి ర్యాలీగా వెళ్లి పీడీ కార్యాలయం ఎదుట భైటాయించారు. సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్‌.రేఖ మాట్లాడుతూ అర్హులైన హెల్పర్లకు ప్రమోషన్ల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు పోస్టింగ్‌లు ఇవ్వకపోవటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎప్పటికప్పుడు ఖాళీఅయిన పోస్టులను గుర్తించి ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేస్తుంటే గుంటూరు జిల్లా అధికారులు మాత్రం జిల్లాలో నూట పది పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ ఎందుకు భర్తీ చేయట్లేదని ప్రశ్నించారు. జిల్లాలో 39 మంది వర్కర్స్‌, 66 మంది హెల్పర్‌ పోస్ట్లు ఖాళీగా ఉండటం వల్ల ఆ సెంటర్లకు వచ్చే పిల్లలు ఏమి నేర్చుకోవాలని ప్రశ్నించారు. అంతేకాకుండా ఇన్‌ఛార్జిలతో సెంటర్లు నిర్వహించటం వల్ల అంగన్‌వాడీలపై తీవ్రమైన పనిభారం పడుతోందన్నారు. గుంటూరులో గత ఆరు నెలలుగా ఒక సెంటర్లో టీచర్‌, హెల్పర్‌ ఇద్దరూ లేకపోవటం వల్ల ఇన్‌ఛార్జిలతో నిర్వహిస్తున్నారన్నారు. ఐసిడిఎస్‌ అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి కానీ, అధికారులు కానీ చిత్తశుద్ధి లేనట్లు కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోన్లు సక్రమంగా పనిచేయకపోతుంటే, వాటిని మార్చడానికి బదులు అంగన్‌వాడీలకు మెమోలు ఇచ్చి వేధించటం సరికాదన్నారు. కొంతమంది సూపర్వైజర్లు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అంగన్వాడీలపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారని విమర్శించారు. యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వై.నేతాజీ మాట్లాడుతూ అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా 42 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. సమ్మె సందర్భంగా గత జులైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, తర్వాత ఎన్నికల్లో గెలుపొందిన కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు. వైసిపి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం కనుక తాము అమలు చేయలేమంటున్న ప్రభుత్వం మరి అదానీతో చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, మట్టి ఖర్చులు జీవోలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమ్మర్‌ హాలిడేస్‌ అంగన్వాడి సెంటర్లో కూడా వర్తింపజేయాలని కోరారు. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలన్నారు. కార్యక్రమానికి యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎవిఎన్‌ కుమారి అధ్యక్షత వహించగా యూనియన్‌ జిల్లా కార్యదర్శి దీప్తి మనోజ, సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.లక్ష్మీనారాయణ, నాయకులు బి.లక్ష్మణరావు, బాబూప్రసాద్‌, ఎస్‌.కె.హుస్సేన్‌వలి ప్రసంగించారు. అంగన్వాడీ యూనియన్‌ నాయకులు పద్మ, చిన్న వెంకాయ్యమ్మ, రాధా, హేమలత, విజరు కుమారి, ప్రేమలత, మరియరాణి పాల్గొన్నారు.
ఖాళీలు భర్తీ చేస్తాం..పీడీ హామీ
జిల్లాలో అంగన్‌వాడీల ఖాళీలు భర్తీ చేస్తామని, హెల్పర్ల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ హామీ ఇచ్చారు. పీడీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన అంగన్‌వాడీల వద్దకు వచ్చిన పీడీకీ నాయకులు సమస్యలను వివరించారు. ముఖ్యంగా ఖాళీల భర్తీ, హెల్పర్ల ప్రమోషన్లు జిల్లా స్థాయిలో చేయగలినా తాత్సారం జరుగుతోందన్నారు. సమస్యలపై పీడీ స్పందిస్తూ సంక్రాంతి పండుగ సెలవుల అనంతరం ఇంటర్వ్యూలో నిర్వహించి, హెల్పర్లు అందరికీ పోస్టింగులు ఇస్తామని, జిల్లాలో ఖాళీగా ఉన్న వర్కర్‌ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారానికి యూనియన్‌ నాయకులతో చర్చిస్తామన్నారు.

➡️