యాదవుల హత్యలను ప్రశ్నించని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ : జీవీ

Apr 23,2024 00:19

ప్రజాశక్తి – వినుకొండ : పల్నాడు జిల్లాలో వరసబెట్టి జరుగ్నుతున్న యాదవుల హత్యలపై ప్రశ్నించని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఇక ఈ ప్రాంతానికి, సొంత సామాజికతరగతికి ఏం చేస్తారని ఎన్‌డిఎ కూటమి తరుపున వినుకొండ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. మాచర్ల నియోజకవర్గంలో చంద్రయ్యను వైసిపి వారు నడివీధిలో చంపారని, జల్లయ్యను హత్య చేశారని, వీటిపై అనిల్‌ ఎందుకు స్పందించరని అన్నారు. పట్టణంలోని మార్కాపురం రోడ్‌ సంతలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి జీవీ ఆంజనేయులు సోమవారం ఎన్నికల ప్రచారం చేశారు. కొందరు మేక పిల్లను జీవీ ఆంజనేయులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో బీసీలు, మరీ ముఖ్యంగా యాదవులకు రక్షణ లేకుండా పోయిందని, అందుకే బీసీల రక్షణకు ప్రత్యేకచట్టం తీసుకుని రావాలని తాము భావించామని చెప్పారు. ప్రస్తుత ఎమ్మెల్యే వరికపూడిశెల ప్రాజెక్టుకు రూపాయి తేలేదని, ఒక్క పరిశ్రమను తేలేదని అన్నారు. చందాలు ఇవ్వబడవు అని ఇంటి ముందు బోర్డు పెట్టారని ఎద్దేవ చేశారు. తాను అనేక సేవా కార్యక్రమాలు చేశానన్నారు. పల్నాడు ప్రాంతం బాగుపడాలంటే గోదావరి జలాలు రావాలని, వాటిని నకరికల్లు వద్ద సాగర్‌ కాల్వకు ఎత్తిపోసి రెండు పంటలకు నీరిస్తామని దాచేపల్లి సభలో చంద్రబాబు స్పష్టం చేశారని గుర్తుచేశారు. తాను గెలిస్తే రూ.2-3 కోట్లతో ఎన్‌ఎస్పీ కాలనీలో బీసీ భవన్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ బొల్లా బ్రహ్మనాయుడు ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారని, ఓటు అనే బెత్తంతో ఆయన వీపు పగలగొట్టి ఇంటికి పంపించాలని అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే సంతలో అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేయాలని జీవీ ఆంజనేయులును కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. అన్న క్యాంటీన్‌ ద్వారా కాకపోయినా శివశక్తి ఫౌండేషన్‌ ద్వారా అయినా భోజన వసతి కల్పిస్తారన్నారు. చంద్రబాబు సిఎం అయిన తర్వాత ఆయనతో మాట్లాడి చెక్‌పోస్ట్‌ సెస్‌ను రద్దు చేసేలా కృషి చేస్తామని మల్లికార్జునరావు చెప్పారు.

➡️