ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్ : అల్లారుమద్దుగా చూసుకోవడం అటుంచితే ముద్ద అన్నం పెట్టడానికి కూడా ఆ తల్లికి చేతులు రాలేదు. పసి దేహంపై పశువులా వాతలు పెట్టడం.. ఒక తల్లికి ఇది ఎలా సాధ్యం అనేంతగా ఆమె చర్యలు విస్మయానికి గురి చేశాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని చిన్నారి కుమార్తెను అట్లకాడతో వాతలు పెట్టి హింసించడమే కాకుండా అన్నమూ పెట్టకుండా వీధిన పడేసిన ఘటన సత్తెనపల్లి పట్టణంలో కలకం రేపింది. గుంటూరుకు చెందిన మాధవి భర్త నాలుగేళ్ల కిందట చనిపోయాడు. దీంతో తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి సత్తెనపల్లిలోని ఓ అద్దె ఇంట్లో కొన్ని నెలలుగా మాధవి నివాసం ఉంటోంది. ఈ క్రమంలో మాధవి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోగా అందుకు ఇల్లు అద్దెకిచ్చిన మహిళా సహకరిస్తోంది. తన చర్యలకు కుమార్తె అడ్డుగా ఉందని భావించిన మధవితోపాటు ఇంటి ఓనర్ అయిన మహిళ సైతం బాలికను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఐదు రోజులుగా అన్నం పెట్టలేదు. ఆకలేస్తోందని అడిగితే ఒళ్లంతా అట్లకాడతో వాతలు పెట్టారు. తీవ్రంగా కాలిన గాయాలతో అల్లాడిన చిన్నారి వేధిస్తున్న గాయాలతోపాటు ఆకలితో కడుపు మాడుతుండడంతో రైల్వేస్టేషన్ రోడ్డులోని చెత్తకుప్పల వెంట పదార్థాలు ఏరుకుని ఆకలి తీర్చుకునే ప్రయత్నం చేసింది. ఇది గమనించిన స్థానికుడొకరు 1098కి ఫిర్యాదు చేయగా ఐసిడిఎస్ సూపర్‌వైజర్ ప్రమీల, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళా కానిస్టేబుల్ చిన్నారి ఇంటికెళ్లారు. ఇది గమనించిన ఇంటి ఓనర్ తన పెంపుడు కుక్కను వారిపైకి ఉసిగొల్పింది. మాధవికి పెళ్లే కాలేదని, ఆమెకు కూతురు ఎక్కడిదని బుకాయించింది. దీంతో వారిద్దర్నీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా కుమార్తె ఉన్నట్లు అంగీకరించారు. చిన్నారిని అధికారులకు కనిపించకుండా దుస్తులు పెట్టే ర్యాక్‌లో దాచినట్లు చెప్పగా పోలీసులెళ్లి పాపను కాపాడి తీసుకొచ్చారు. బాలిక శరీరంపై ఉన్న వాతలు, దెబ్బలు చూసిన పోలీసులు, ఐసిడిఎస్ సిబ్బంది విస్మయానికి గురయ్యారు. వెంటనే బాలికను నరసరావుపేటలోని శిశు సంరక్షణ కేంద్రానికి తరలింకి కేసు నమోదు చేశారు.
