అన్నదాత సుఖీభవ విధివిధానాలు ప్రకటించాలి

Sep 30,2024 00:42

తహశీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ :
వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్‌ ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతుసంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు జి.బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. అన్నదాత సుఖీభవ పథకం విధివిధానాలు ప్రకటించాలని కోరుతూ రైతు, కౌలురైతు సంఘాల ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేశారు. కార్యక్రమానికి. కౌలురైతు సంఘం మండల కార్యదర్శి పి.మహేష్‌ అధ్యక్ష వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైనా అన్నదాత సుఖీభవ విధివిధానాలను ప్రకటన చేయలేదన్నారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.20 వేల పెట్టుబడి సాయం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే వర్షాల వల్ల పంటలు దెబ్బ తినడంతో రైతులు సాయం కోసం ఎదురు చూస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదని అన్నారు. కౌలు రైతుల అందరికీ గుర్తింపు కార్డులు ఇస్తున్నామని చెప్పిన ప్రభుత్వం ఆ మాటనూ నెరవేర్చలేదన్నారు. ఓసీ కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డులతోపాటు బ్యాంకు రుణాలివ్వాలన్నారు. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పంటల బీమా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహశీల్దార్‌ చక్రవర్తికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు గద్దె చలమయ్య, ఎం.నరసింహారావు, ఆర్‌.పూర్ణచంద్రరావు, సిహెచ్‌ లక్ష్మీనారాయణ, జె.భగత్‌, శివ, రాజకుమార్‌, అశోక్‌, వెంకటేశ్వర్లు, వెంకటనారాయణ, సూర్యప్రకాశరావు పాల్గొన్నారు.

➡️