నేడు జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద నిరసన
ప్రజాశక్తి-మదనపల్లె అర్భన్ : అనుమతుల్లేని నర్సరీలను రద్దు చేయాలని, నాసిరకం నారు అమ్ముతున్న నర్సరీ యజమానులుపై కఠిన చర్యలు చేపట్టాలని, ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం, ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో నష్టపోయిన కౌలురైతులతో విలేకరల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పి.జములయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 20వేల నుంచి 30 వేల ఎకరాల్లో బొప్పాయి సాగు చేస్తున్నారని, వీరంతా చిన్న, సన్నకారు కౌలు రైతులే ఉన్నారన్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నర్సరీ యజమానులు నాసిరకం నారుని అంటగట్టి కోట్లాది రూపాయలు సంపాదిస్తుంటే రైతుల మాత్రం పీకల్లో అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ లో విచ్చలవిడిగా నాసిరకం విత్తనాలు అమ్ముతున్న కంపెనీలపైన, నాసిరకం నారు పెంచుతున్న నర్సరీ యజమానలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. జిల్లాలో బొప్పాయి సాగు జీవనాధారం గా చేసుకుని దాదాపు 5 నుంచి 10వేల ఎకరాల వరకు బొప్పాయి సాగు చేస్తున్నారన్నారు. గత ఎనిమిది నెలల క్రితం కలికిరిలో ఎల్లారెడ్డి నర్సరీ, రాజన్న నర్సరీ, మదనపల్లెలో శేఖర్ రెడ్డి నర్సరీల నుంచి బొప్పాయి నారును మొక్క ఒకటి రూ.12ల చొప్పున కొనుగోలు చేసి పొలాల్లో నాటారన్నారు. పూత, పిందె ఉన్నప్పటికి కాయ సైజు పెరగ కపోవడం, చెట్టుకు కాయ నిలబడకుండా రాలిపోవడం జరుగుతుందన్నారు. దీనికి నాశిరకం నారే కారణమన్నారు. ఎకరానికి రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టారని, 24 నుంచి 30 టన్నులు దిగుబడి రావలసిన బొప్పాయి కనీసం రెండు మూడు టన్నులు కూడా రాకపోవడం దారుణమన్నారు. సాగు చేస్తున్న చిన్న, సన్న కారు కౌలు, రైతులకు ఉద్యానవన శాఖ నుండి ఎటువంటి ప్రోత్సహకాలు ఇవ్వటం లేదని రోజు రోజుకి మార్కెట్ లో బొప్పాయి రేట్లు పడిపోవడం, సాగు ఖర్చులు పెరగటంతో అల్లాడిపోతున్నారన్నారని తెలిపారు. దీనికి తోడు నర్సరీ యజమానులు కల్తీ, నాసిరకం నారును అమ్ముతూ స్వైర వివహరం చేస్తుంటే ఆధికారులు మొద్దు నిదర పోతున్నారని ఆరోపించారు. బొప్పాయి సాగు చేసే రైతుల్లో 99 శాతం కౌలు రైతులేనని ఎవరికీ కౌలు గుర్తింపు కార్డులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయలేదన్నారు. దీంతో పంట రుణాలు గాని, పెట్టుబడి సాయం గాని అందటం లేదన్నారు. బొప్పాయి పంటలకు బీమా పథకం కాని పునరుద్ధరించిన వాతావరణ బీమా పథకం గాని అమలు చేయటం లేదన్నారు. బొప్పాయి పంటకు భీమ వర్తించకపోవడం వలన ప్రకృతి ఉత్పత్తులు, చీడపీడలు వల్ల నష్టపోవటం జరుగుతుందన్నారు. 2024 – 2025 సంవత్సరంలో నైనా బొప్పాయి పంటకు బీమా పథకం వర్తింప చేయాలని కోరారు. ప్రభుత్వం నర్సరీలు ఏర్పాటు చేసి , ఉద్యానవన పంటలకు అవసరమైన నారుని రాష్ట్ర ప్రభుత్వమే సప్లై చేయాలని, నాణ్యమైన పంటకు దిగుబడికి ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నాసిరకం నారు వల్ల నష్టపోయిన బొప్పాయి రైతులకు ఎకరానికి రెండు లక్షల రూపాయలు చొప్పున నర్సరీ యాజమాన్యం నుంచి ఇప్పించాలని, అనుమతి లేని నర్సరీలను రద్దు చేయాలని, నాసిరకం నారు అమ్మి రైతులను మోసగిస్తున్న విత్తన కంపెనీలను, నర్సరీ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నర్సరీలో జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను అరికట్టడానికి నర్సరీ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపి రైతుసంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పిఎల్ నరసింహులు, బొప్పాయి రైతు సంఘం నాయకులు కె. రామకృష్ణ, కె గంగిరెడ్డి, బి అనిల్ కుమార్, య.గంగరాజు, బి.రామమూర్తి,డి గురునాద, బి.నారాయణ, కె. రాఘవేంద్ర యాదవ్, తదితరులు పాల్గొన్నారు.