రాజంపేట అభ్యర్థిగా బత్యాలనే ప్రకటించాలి

Apr 1,2024 16:45 #Annamayya district

బత్యాల ఆధ్వర్యంలో భారీ బల నిరూపణ ప్రదర్శన, ర్యాలీ..

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ టికెట్ బత్యాల చెంగల రాయుడికే కేటాయించాలని కోరుతూ సోమవారం రాజంపేట నియోజకవర్గం అసెంబ్లీ ఇంచార్జి బత్యాల చెంగల రాయుడు ఆధ్వర్యంలో ఎస్సార్ కల్యాణ మంటపం నుంచి పాత బస్టాండ్ మీదుగా యల్లమ్మ ఆలయం వరకు సుమారు పదివేల మందితో బల నిరూపణ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బత్యాల అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని సుగవాసి వద్దు, బత్యాల ముద్దు అంటూ నినాదాలు చేశారు. రాజంపేట అన్ని విధాల అభివృద్ధి చెందాలన్నా, జిల్లా కేంద్రం సాధించుకోవాలన్నా భత్యాలతోనే సాధ్యమని నినాదాలు చేశారు. మూడు గంటలసేపు కొనసాగిన ఈ ర్యాలీలో ఊహించని రీతిలో జనాలు తరలి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. భత్యాలకు అడుగడుగునా మహిళలు నీరాజనం పలికారు. ఈ సందర్భంగా బత్యాల వర్గీయులు మాట్లాడుతూ గత ఎన్నికలలో ఓటమిపాలైనా నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగించి రాజంపేటలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసిన భత్యాలను కాదని రాయచోటికి చెందిన సుగవాసికి సీటు కేటాయించడం జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా పునరాలోచించి సుగవాసిని బుజ్జగించి నియోజకవర్గ వ్యాప్తంగా గట్టిపట్టున్న బత్యాల చెంగల రాయుడు ను రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. బత్యాలకు టికెట్ కేటాయించకపోతే ఆత్మహత్యలకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సుండుపల్లె, వీరబల్లె, రాజంపేట నందులూరు, ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల నుంచి టిడిపి అభిమానులు, బత్యాల వర్గీయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️