న్యాయవ్యవస్థ ఎంతో దృఢమైంది

  • సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సరసా వెంకటనారాయణ భట్టి
  • మదనపల్లిలో అడిషనల్‌ సివిల్‌ జడ్జి కోర్టు ప్రారంభం

ప్రజాశక్తి- మదనపల్లె అర్బన్‌ (అన్నమయ్య జిల్లా) : భారతదేశ న్యాయవ్యవస్థ ఎంతో దృఢమైందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సరసా వెంకటనారాయణ భట్టి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని కోర్టు సముదాయంలో నూతనంగా నిర్మించిన అడిషనల్‌ సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌) కోర్టు భవనాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ సరసా వెంకటనారాయణ భట్టి మాట్లాడుతూ దేశచరిత్రలో మదనపల్లి పట్టణానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జాతీయ గీతం జనగణమనను ప్రసిద్ధిగాంచిన బిటి కళాశాలలో బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేశారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగం 470 ఆర్టికల్స్‌, 106 రాజ్యాంగ సవరణ చట్టాలు కలిగి ఉందని వివరించారు. ముఖ్యంగా ఆర్టికల్‌ 14 దేశ పౌరుల సమానత్వాన్ని తెలియజేస్తోందని తెలిపారు. సుప్రీంకోర్టు సర్వోన్నతమైందన్నారు. న్యాయవ్యవస్థపై దేశ ప్రజలకు మరింత నమ్మకం పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇది జరగాలంటే కేసులను త్వరితగతిన పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. గతంలో ఎంతోమంది ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ఔన్నత్యాన్ని పెంపొందించారని తెలిపారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు పనిచేయడం దేశ న్యాయవ్యవస్థకు గర్వకారణమన్నారు. భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ పరస్పర సహకారంతో దేశప్రతిష్ట పెంచుతున్నాయని కితాబిచ్చారు.

మదనపల్లెలో తన చిన్ననాటి జ్ఞాపకాలు, విద్యాభ్యాసం, లాయర్‌గా ప్రాక్టీస్‌, తన గురువులు అందించిన ప్రోత్సాహాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ మదనపల్లి కోర్టు సముదాయంలోని మేజిస్ట్రేట్‌ కోర్డు భవనం పూర్వం ఎంతో నైపుణ్యంగా రాతి కట్టడంతో కట్టారని, ఆ భవనాన్ని యథాస్థితిలో ఉంచి, ఆ భవనంపైనే కొత్త భవనం నిర్మించి మరో కోర్టును ఇస్తామని తెలిపారు. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఇక్కడే జనగణమన ఆలపించడం, జిడ్డు కృష్ణమూర్తి ఈ ప్రాంతవాసి కావడం, బిటి కళాశాల ఉండడం, ఇంత ఘన చరిత్ర ఉన్న మదనపల్లెలో కోర్టు భవనం ప్రారంభించడం జ్ఞాపకంగా ఉంటుందన్నారు. దీనికి ముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు హైకోర్టు జడ్జిలు జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌, జస్టిస్‌ టిసిడి శేఖర్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు తొట్లి వెంకట రమణారెడ్డి, చిత్తూరు ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్‌ జడ్జి భీమారావు, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు ఘనస్వాగతం పలికారు. మదనపల్లె బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా జడ్జి జస్టిస్‌ అబ్రహం, ఇతర కోర్టుల న్యాయమూర్తులు వెంకటేశ్వర్‌ నాయక్‌, శిరీష్‌, విజయకుమార్‌ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌, సబ్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌, అడిషనల్‌ ఎస్‌పి వెంకటాద్రి, తహశీల్దార్‌ ధనుంజయులు తదితరులు పాల్గొన్నారు.

➡️