ప్రజా సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి 

Nov 27,2024 13:43 #Annamayya district

వైస్ ఎంపీపీ ద్వజారెడ్డి 
ప్రజాశక్తి-రైల్వేకోడూరు : రైల్వే కోడూరు మండలంలోని ప్రజల సమస్యలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైస్ ఎంపీపీ రామిరెడ్డి ద్వజారెడ్డి అన్నారు. బుధవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీవో నాగార్జున రావు నిర్వహించారు.ఈ సమావేశంలో ధ్వజారెడ్డి మాట్లాడుతూ వర్షాలు తరచూ పడుతుండడం వలన అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని ఆయా గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో సర్పంచులు ఎంపీటీసీలు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారని వాటిని అధికారులు వెంటనే పరిష్కరించాలని అన్నారు. గ్రామ పంచాయతీలలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల గురించి సంబంధిత సర్పంచులకు సమాచారం ఇవ్వడం లేదని సర్పంచులు దార్ల చంద్రశేఖర్, హరికృష్ణ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.కే బుడుగుంటపల్లె ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపు పై సర్పంచ్ చంద్రశేఖర్ ఏపీవో ఉమామహేశ్వరరావు ను ప్రశ్నించారు. అనంతరాజుపేట వద్ద నుంచి కుక్కల దొడ్డి వరకు ప్రధాన రహదారిలో భారీ గుంతలు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఎంపీటీసీ బండారు మల్లికార్జున అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.ప్రధాన రహదారిలో ఏర్పడిన గుంతలు సత్వరం పూడ్చకపోతే పార్టీలకతీతంగా సర్పంచులు ఎంపీటీసీలతో ధర్నా నిర్వహిస్తామని ధ్వజారెడ్డి అన్నారు. సర్వసభ్య సమావేశానికి హాజరుకాని శాఖల అధికారులకు నోటీసులు పంపుతామని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు పాలెంకోట రత్నమ్మ, జిల్లా కోఆప్షన్ సభ్యులు అన్వర్ భాష,ఏవో చంద్రబాబు రాజు, సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు.

➡️