ప్రజాశక్తి-పీలేరు: కందుకూరి విశిష్ట పురస్కారానికి పీలేరుకు చెందిన ప్రముఖ బహుభాషా కళాకారుడు, పాత్రికేయుడు, సామాజిక సేవా కార్యకర్త ఖాదర్ బాష షేక్ ఎంపికయ్యారు. రాష్ట్ర ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మంగళవారం రాత్రి ఈ మేరకు సమాచారం అందుకున్నారు. నాటక రంగంలో అత్యుత్తమ సేవలందిస్తున్న కళాకారులు, సాంకేతిక నిపుణులు, రచయితలు, దర్శకులకు రాష్ట్ర ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటించిన కందుకూరి విశిష్ట పురస్కారాల్లో ఖాదర్ బాష షేక్ ను జిల్లా స్థాయి పురస్కారం వరించింది. అన్నమయ్య జిల్లా, పీలేరుకు చెందిన ఈయన గత 43 ఏళ్లుగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు పలు సామాజిక, ప్రజా సమస్యలపై ఆధునిక వీధి నాటికల ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో జాతీయ, అంతర్జాతీయ రంగ వేదికలపై జరిగిన సాంఘిక నాటిక, నాటక ప్రదర్శనల్లో పాల్గొంటూ ఓ విభిన్న నటుడిగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నారు. అదేవిధంగా లఘుచిత్రాలు, సినిమాల్లోనూ నటిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఇప్పటికే 2000లకు పైగా ఆధునిక వీధి నాటీకలు, 2500 లకు పైగా జాతీయ స్థాయిలో సాంఘిక నాటకాలు, 25కు పైగా విదేశీ రంగ వేదికలపై కన్నడ, హిందీ నాటక ప్రదర్శనలు ఇచ్చారు. రేడియో, దూరదర్శన్, ప్రైవేటు ఛానళ్లలో 60కి పైగా కార్యక్రమాల్లో నటించారు. అమెరికా, ఖతార్, మస్కత్, బెహ్రీన్ వంటి దేశాల్లో పలు నాటక ప్రదర్శనల్లో భాగం వహించారు. అలాగే సింగపూర్, కువైట్ దేశాల్లో పర్యటించారు కూడా. నాటక రంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఇది వరకే అనేక సంస్థలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఐకాన్ అవార్డు, సర్వేపల్లె రాధాకృష్ణన్ ఎక్సలెన్సీ అవార్డు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లెజండరీ అవార్డు, ఎన్టీఆర్ లెజండరీ అవార్డు, ఏపీజే అబ్దుల్ కలాం జీవన సాఫల్య పురస్కారం, మదర్ థెరీసా సేవారత్న అవార్డు, గుర్రం జాషువా జీవిత సాఫల్య పురస్కారాలతోపాటు మరెన్నో ఇతర పురస్కారాలను కూడా అందించారు. కందుకూరి విశిష్ట పురస్కారానికి తనను ఎంపిక చేసినందుకు ఖాదర్ బాషా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆయనకు అభినందనలు తెలిపారు.
