ప్రైవేటు పాఠశాలల ప్రచారాన్ని నిలువరించాలి

Jun 8,2024 16:45 #Annamayya district

పిడిఎస్.యు

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం నువ్వే గాని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఆరంభించిన ప్రచారాన్ని వెంటనే నిలువరించాలని పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు నేతి నాగేశ్వర డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారి రఘునాథరాజుకు శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాగేశ్వర మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం లేని వసతులు ఉన్నట్లు చూపిస్తూ కరపత్రాలు ఆవిష్కరించి పట్టణాలు, గ్రామాలలో ఉపాధ్యాయులచే పంపిణీ చేయించి విద్యార్థుల తల్లిదండ్రులను మోసగిస్తున్నారని ఆరోపించారు. కొన్ని పాఠశాలలలో కనీసం మౌలిక వసతులు లేవని, వ్యాయామ ఉపాధ్యాయుడు, తేడా మైదానం వంటివి లేవని తెలిపారు. పాఠశాలల ఏర్పాటు, నిర్వహణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుమారు 40 నిబంధనలలో ఏఒక్కటీ పాటించకుండా విద్యాశాఖ కార్యాలయాలలో ప్రైవేటు పాఠశాలలు తప్పుడు పత్రాలు సమర్పిస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు చాలీచాలని వేతనం ఇస్తూ వారి చేత వెట్టి చాకిరి చేయించుకోవడమే కాక ఉపాధ్యాయులని కూడా చూడకుండా వారిని అడ్మిషన్ల కోసం వీధుల వెంట తిప్పుతున్నారని అన్నారు. మితిమీరిన ప్రైవేటు పాఠశాలల ఆగడాలను నేటికైనా విద్యాశాఖ అధికారులు అరికట్టాలని డిమాండ్ చేశారు.

➡️