సుబ్బారావు కుటుంబం మృతికి రెవెన్యూ అధికారులే కారణం

Mar 25,2024 15:42 #Annamayya district

పూల భాస్కర్

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : మాధవరంలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకుని మృతి చెందడానికి రెవెన్యూ అధికారులే కారణమని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పూల భాస్కర్ పేర్కొన్నారు. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆయన కుటుంబం మృతి చెందినట్లు ఓ వర్గం పక్క దారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సోమవారం పూల భాస్కర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాధవరం లోని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుబ్బారావు తండ్రి పేరుతో ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు ఇతరుల పేరిట బదలాయించలేదా.., అది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సుబ్బారావు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగడం వాస్తవం కాదా అన్నారు. సుబ్బారావు కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి స్థానికులు చెబుతున్న వాస్తవాలు వింటే ఆవేదన కలుగుతోందని అన్నారు. భూదాహంతో ఓ నిండు కుటుంబాన్ని బలి తీసుకున్న అక్రమార్కులపై వెంటనే చర్యలు చేపట్టి ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించి, సుబ్బారావు కుమార్తె చదువులకు ప్రభుత్వం సహకరించి ఆ కుటుంబంపై ఉన్న అప్పుల ఒత్తిడి నుంచి కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలియజేశారు. సుబ్బారావు కుటుంబానికి న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాజంపేట పట్టణ అధ్యక్షులు కనిశెట్టి నరేష్, ఒంటిమిట్ట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

➡️