ప్రజాశక్తి – కడప ప్రతినిధి/రాయచోటిసాధ్యమైనంత తొందరగా హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను పూర్తి చేసి, శ్రీనివాసపురం రిజర్వాయర్‌కు నీళ్లిస్తామని ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు పేర్కొన్నారు. శనివారం అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలోని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, పేదల సేవలో పేరుతో నిర్వ హించిన పింఛన్ల పంపిణీ అనంతరం ప్రజావేదిక కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పింఛన్ లబ్ధిదారులైన కొప్పుల మంగమ్మ, గొల్లచలపతి, వెంకటేశ్వర్లు ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలను తెలుసుకుని రూ.4 వేలు, వికలాంగుడైన వెంక టేశ్వర్లుకు రూ.ఆరువేల ఫింఛన్ అందించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకమైన వత్సర కింద మరో నాలుగు వేలను కలిపి మంగమ్మకు రూ.ఆరు వేలు, వికలాంగుడైన వెంకటేశ్వర్లుకు రూ.10 వేలు ఇస్తామని తెలిపారు. అనంతరం పింఛనుదారుల అభ్యర్థన మేరకు ఇళ్ల స్థలం, ఇళ్ల నిర్మాణానికి హామీనిచ్చారు. అనంతరం వికలాంగుడైన వెంకటేశ్వర్లకు ఎలక్ట్రిక్ ట్రైసైకిల్, రూ.30 వేల విలువ కలిగిన సబ్సిడీ సోలార్ విద్యుత్ సదుపాయాన్ని కలిగించారు. రూ.1.64 కోట్లతో సిసి రోడ్ల నిర్మాణ శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ శ్రీనివాసపురం రిజర్వాయర్‌ను నింపితే 30 వేల ఎకరాలు సాగులోకి వస్తుందని తెలిపారు. రాయచోటికి శ్రీనివాసాపురం ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తామన్నారు. నీరు ప్రణధారం అని గుర్తించిన ప్రభుత్వం రాయలసీమలో నీటిని స్టీరేకరించి రాష్ట్రంలో కోనసీమ కంటే రాయలసీమ అత్యధిక ఆధాయ వనరును సృస్తిస్తామన్నారు. చెత్త నుండి సంపదను సృష్టించే మార్గాలను కూడా చేపడతామన్నారు. రాయలసీమలో హార్టికల్చర్, ఆంధ్రాలో ఆక్వా కల్చర్, కోస్తాలో ఆయిల్ ఫామ్ పంటలు ఆర్థిక లాభాలకు బాటలు వేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. సంపదను సృస్టించే మార్గాలు తెలివి తేటలతోనే వస్తాయని, ఆ తెలివి అనేది మన పిల్లల చదువులోనే వుందన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని, ఈ ప్రాంతాన్ని ఉద్యాన హబ్‌గా మార్చి రాష్ట్రంలో ప్రధాన ఆదాయ వనరుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కూరగాయలు సాగుచేసే రైతులు అధికంగా వున్నారని తెలిపారు. ప్రతి ఏడాది పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక అనేక మంది రైతు కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి ఖచ్చితంగా మద్దతు ధరను ప్రతి పంటకు అందిస్తామన్నారు. రాయలసీమలో ఉద్యానపంటలకు పుట్టినిల్లుగా మారిందని, అది మన రాయలసీమ జిల్లాల ప్రధాన ఆదయవనరుగా మార్చుకోవాలన్నారు. కడపలోని కొప్పర్తి పారిశ్రామిక వాడకు చేయూతనిస్తామన్నారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన ఈ ఎనిమిది నెలల కాలంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందజేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో కేవలం ఏడు నెలల్లో రూ.100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి మంత్రి బి.సి.జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కిషోర్‌కుమార్‌రెడ్డి, అరవ శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి, జయచంద్రారెడ్డి షాజహాన్‌బాషా, అన్నమయ్య డెవలప్‌మెంట్ చైర్మన్ రూపానందరెడ్డి, కలెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు.
