సమావేశంలో మాట్లాడుతున్న వై.కేశవరావు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రైతుల, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 26న పల్నాడు కలెక్టరేట్ వద్ద మహాధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర కోశాధికారి వై.కేశవరావు పిలుపునిచ్చారు. నరసరావుపేట పట్టణం ఏంజెల్ టాకీస్ వద్దగల అవ్వారు భావన్నారాయణ భవన్‌లో రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక, ప్రజాసంఘాల జిల్లా సమన్వయ సమితి సన్నాహక సమావేశం మంగళవారం జరిగింది. కేశవరావు మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నాలుగేళ్ల క్రితం నవంబర్ 26న చారిత్రాత్మకమైన రైతు ఉద్యమం ప్రారంభమైందని, కార్మికోద్యమ సహకారంతో 540 రైతు సంఘాలు పోరాటంలో భాగస్వామ్యం అయ్యాయని చెప్పారు. ఆ పోరాటంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి నల్ల చట్టాలను వెనక్కు తీసుకుందన్నారు. ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయలేదని, దీంతో మరోసారి ఉద్యమాలకు సిద్ధమవ్వాలని చెప్పారు. 26న దేశవ్యాప్తంగా 500లకు పైగా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని రైతు, కార్మిక, ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి ప్రసాద్ మాట్లాడుతూ నల్ల చట్టాలను దొడ్డిదారిని తెచ్చి వ్యవసాయ రంగ మొత్తాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలని కేంద్రం యత్నిస్తోందన్నారు. 36 మంది వీరుల ప్రాణ త్యాగ ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అప్పనంగా కార్పొరేట్ల పరం చేయాలని చూస్తోందని, ఈ చర్యలను కార్మికులు, రైతులు కలిసి తిప్పికొట్టాలని అన్నారు. రైతుసంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక ప్రజాసంఘాల సమన్వయంతో ప్రచార జాతాలు నిర్వహించి ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలన్నారు. రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవపూడి రాము మాట్లాడుతూ పంటలకు మద్దతు ధరలు చట్టం చేయాలని, రైతులను రుణ విముక్తులను చేయాలని జరిగే ఉద్యమంలో అన్ని రంగా ప్రజలు కలిసి రావాలన్నారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు టి.ఆంజనేయులు, ఎన్.రాంబాబు, ఇ.గోపీచంద్, కె.రాంబాబు, మారుతీ వరప్రసాద్, ఎస్.ఆంజనేయులు నాయక్, గుంటూరు విజరుకుమార్, కె.రామారావు, కె.రోశయ్య మాట్లాడారు. జి.బాలకృష్ణ, టి.బాబురావు, కె.హనుమంతరెడ్డి, సిలార్ మసూద్, డి.శివకుమారి, జి.మల్లేశ్వరి, టి.శ్రీను, పి.వెంకటేశ్వర్లు, యు.రంగయ్య, వి.వెంకట్, సైదా పాల్గొన్నారు.