ప్రజాశక్తి-అనకాపల్లి : ఎఐసిసి అధ్యక్షురాలు, సొంత చెల్లెలు షర్మిలారెడ్డి వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తానంటూ జగన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆరోపించారు. గురువారం జిల్లా టిడిపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, వైసిపి పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలను పెంచి, ప్రజలపై రూ.72 వేల కోట్లు భారం మోపిన జగన్‌రెడ్డి, అప్పట్లో డిస్కంలకు రూ.11వేల కోట్ల బకాయిలను ఉంచేశారని, ఇపుడవి వినియోగదారులు తప్పక చెల్లించాల్సిన పరిస్థితిలో నిందను చంద్రబాబుపై మోపడం సరికాదన్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియింబర్స్‌మెంట్, వసతిదీవెన నిధులు రూ.3500 కోట్లు వైసిపి కాంట్రాక్టర్లకు బిల్లులుగా చెల్లించి, నేడు కూటమి ప్రభుత్వంపై అబద్దాల ఆరోపణలు చేయడం జగన్‌కే చెల్లిందని మండిపడ్డారు. దీంతో ఉన్నత విద్యావకాశాలకు దూరమౌతున్న బిటెక్ విద్యార్థులకు నాటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలన్నారు. సమావేశంలో పార్లమెంట్ కార్యనిర్వాక కార్యదర్శి కుప్పిలి జగన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ బోడి వెంకట్రావు, పార్లమెంట్ వాణిజ్య విభాగం సెక్రటరీ సాలాపు నాయుడు, అనకాపల్లి పార్లమెంట్ టి ఎన్ టి యు సి ఉపాధ్యక్షులు దొడ్డి జగదీష్ పాల్గొన్నారు.
.మాట్లాడుతున్న నాగ జగదీష్