ప్రజాశక్తి-శృంగవరపుకోట : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను విడనాడకుంటే రానున్న రోజులలో పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తూరు గ్రామంలో నిర్వహించిన సిపిఎం శాఖ మహాసభలో తమ్మినేని సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పాలక పార్టీలు ఎన్నికల వరకే ప్రజలను వాడుకుని తర్వాత ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని అన్నారు. బొడ్డవర వద్ద జిందాల్ అల్యూమినియం కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయని బొత్స సత్యనారాయణ, రఘురాజు చెప్పిన మాటలు నమ్మి కంపెనీకి భూములిచ్చిన రైతులు మోసపోయారని, నాయకులు డబ్బులు బాగా సంపాదించుకొని లాభపడ్డారని అన్నారు. సిపిఎం పోరాట ఫలితంగా సాధించిన ఉపాధి హామీని నీరు గారుస్తున్నారని అన్నారు. కొత్తూరులో ఎస్సీ కాలనీని సిపిఎం పోరాటాలతోనే సాధించుకున్నామనిచ పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గాడి అప్పారావు, మద్దిల రమణ, రామ్మోహన్, చెలికాని ముత్యాలు, భాస్కరరావు, శంకర్, క్వారీ కార్మికులు పాల్గొన్నారు.