అంటిజోల – మణిగి బిటి రోడ్డు పరిశీలన

Apr 15,2025 21:30

ప్రజాశక్తి – కురుపాం :  మండలంలో జి.శివడ పంచాయతీలో గల అంటిజోల నుండి మణిగి గ్రామానికి 2.3 కిలోమీటర్ల బిటి రోడ్డును పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ ఎంశ్రీనివాస్‌, పంచాయతీరాజ్‌ ఇఇ జి.రవి మంగళవారం పరిశృలించారు. ఈ రోడ్డు వేసిన రెండు వారాలకే ఎక్కడికక్కడ పెచ్చులూడి నాణ్యత డొల్లతనం తేటతెల్లమైంది. ‘కాంట్రాక్టుల నిర్లక్ష్యమా లేక అధికారుల పర్యవేక్షణ లోపం’ తూతూ మంత్రంగా బీటీ రోడ్డు పనులు అన్న శీర్షికన సోమవారం ‘ప్రజాశక్తి’లో కథనం వెలువడింది. ఈ కథనానికి జిల్లా కలెక్టర్‌ ఎ. శ్యాంప్రసాద్‌ స్పందించి వెంటనే బిటి రోడ్డు నిర్మాణ పనులపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నివేదిక అందజేయాలని పంచాయత్‌ రాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వారు మంగళవారం ఉదయం బిటి రోడ్డు దగ్గరకు వెళ్లి నిర్మాణ పనులను పరిశీలించారు. జరిగినది వాస్తవమేనని, పరిశీలించి నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని అన్నారు. అనంతరం ప్రజాశక్తితో వారు మాట్లాడుతూ కాంట్రాక్టర్‌కు ఇంత వరకు ఎటువంటి బిల్లు చెల్లించలేదని 10 రోజుల్లో పాడైన రోడ్డంతా మళ్లీ కొత్తగా వేసి ఇస్తానన్నారని, రోడ్డు వేసిన అనంతరం తాము మళ్లీ బిటి రోడ్డు వద్దకు వచ్చి పనుల నాణ్యత పరిశీలించి అనంతరం బిల్లు పెడతామని తెలిపారు. ఈ పరిశీలనలో పంచాయతీ రాజ్‌ డిఇ జి.శ్రీనివాస్‌, ఎఇ పి.నాగేశ్వరరావు, పంచాయతీరాజ్‌ సిబ్బంది పాల్గొన్నారు. నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణం జరగాలి గుమ్మలక్ష్మీపురం : జిల్లాలో చేపడుతున్న రోడ్లు నిర్మాణం నాణ్యతతో కూడుకొనేలా కలెక్టర్‌, సీతంపేట, పార్వతీపురం ఐటిడిఎ పిఒలు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాడంగి సాయి బాబు, పాలక రంజిత్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో రోడ్డు నిర్మాణంలో నాణ్యతపై మీడియాలో వస్తన్న కథనాలపై అధికారులు స్పందించాలన్నారు. పాలకులు కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దని కోరారు. ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే నాణ్యమైన రోడ్లు నిర్మాణం జరుగుతుందన్నారు. నాసిరకం రోడ్లు వేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️