ప్రజాశక్తి-వేపాడ : ఎమ్మెల్యే ఇందుకూరి రఘురాజు హామీతో ఆతవ గ్రామస్తులు ఆందోళనను విరమించారు. ఆతవ గ్రామానికి వెళ్లే రోడ్డు పనులు ప్రారంభించాలని కోరుతూ వారం రోజులుగా ఆ గ్రామస్తులు ఆందోళన చేపడుతున్నారు. రోజుకో రూపంలో నిరసన తెలియజేస్తూ వచ్చారు. ఆదివారం గ్రామస్తుల నిరసన శిబిరం వద్దకు వచ్చిన ఎమ్మెల్సీ వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 20వ తేదికి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారులు పనులు ప్రారంభించకపోతే, తన సొంత డబ్బులతోనైనా రోడ్డు పని ప్రారంభిస్తానని ఆయన హామీఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి అడపా ఈశ్వరరావు, సర్పంచ్ వి.రామునాయుడు, సిపిఎం జిల్లా నాయకులు చల్లా జగన్, తదితరులు పాల్గొన్నారు.
