ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్‌లో వైసిపి ఆధిపత్యానికి గండి పడింది. మొత్తం 56 మంది కార్పొరేటర్లు ఉండగా 34 మంది టిడిపి కూటమికి మద్దతు పలికారు. దీంతో మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలోని వైసిపి కౌన్సిల్‌కు ముప్పు ఏర్పడింది. మెజార్టీ కార్పొరేటర్లు విశ్వాసాన్ని కోల్పోయిన వైసిపి ఆత్మ రక్షణలో పడింది. గుంటూరు నగరపాలక సంస్థపై టిడిపి పూర్తిస్థాయిలో పట్టు సాధించడంతో మార్చి 18వ తేదీ తర్వాత ఎప్పుడైనా మేయర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడానికి టిడిపి కూటమి నాయకులు సన్నాహాలు చేసుకుంటున్నారు. కార్పొరేషన్ రాజకీయ వ్యవహారాల్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కీలకంగా మారాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో ఆరు స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగ్గా ఆరు స్థానాలను టిడిపి, జనసేన గెలుపొందాయి. వైసిపికి గరిష్టంగా 24 ఓట్లు రాగా టిడిపికి గరిష్ఠంగా 34 ఓట్లు రావడం కలకలం రేపింది. వైసిపి సభ్యులు కొంత మంది క్రాస్ ఓటింగ్ వల్ల టిడిపికి 34ఓట్లు రావడానికి అవకాశం ఏర్పడింది. వాస్తవంగా టిడిపికి 32 మంది, 24 మంది ఉన్నట్లు తాజా బలబలాలను బట్టి తెలుస్తోంది. టిడిపి తరఫున కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నజీర్ అహ్మద్, బి.రామాంజనేయులు వ్యూహాత్మకంగా పనిచేశారు. వారం రోజుల్లో 12 కార్పొరేటర్లను వైసిపి నుంచి టిడిపిలోకి వచ్చేలా వ్యూహరచన చేశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కార్పొరేషన్‌లో పూర్తిస్థాయిలో టిడిపి కూటమి పట్టు సాధించినట్లయింది. గత నాలుగేళ్ల కాలంలో టిడిపి సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై కూడా గుర్రుగా ఉన్న ఆ పార్టీ నాయకులు పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అయితే కేవలం ఏడాది కాలానికి మేయర్ పదవి తీసుకునే విషయంలో టిడిపిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ కొంతమంది కార్పొరేటర్లు కార్పొరేషన్‌లో టిడిపికి అవకాశాలు మెరుగ్గా ఉన్నప్పుడు ఏడాది కాలమైనా మేయర్ పదవిని ఎందుకు వదులుకోవాలి అనే తరహాలో పార్టీ సీనియర్ నాయకులను ఒప్పించి సెమీఫైనల్స్‌గా భావిస్తున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వ్యవహరించారు. కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరాంప్రసాదు, స్మితా పద్మజ, వరప్రసాద్ తదితరులు ఎమ్మెల్యేలతో కలిసి వైసిపి కార్పొరేటర్లు టిడిపిలో టిడిపిలోకి వచ్చే విధంగా పావులు కదిపారు. టిడిపి తరఫున మేయర్ స్థానాన్ని ఆశిస్తున్న వేములపల్లి శ్రీరాం ప్రసాదు మొత్తం వ్యవహారంలో కీలక భూమిక పోషించారు. ఐతే అధిష్టానం మేయర్ పదవికి ఎవర్ని ఎంపిక చేస్తుందోననే అంశంపై టిడిపిలో ఉత్కంఠ ఏర్పడింది. నాలుగేళ్ల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చిన కోవెలమూడి రవీంద్ర కూడా తాజాగా మేయర్ పదవి తీసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
