రజక వృత్తిదారులకు ఇచ్చిన హామీలను అమలుపరచాలి : ఎపి రజక వృత్తిదారుల సంఘం

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : ఆంధ్రప్రదేశ్‌ రజక వృత్తిదారుల సంఘం కర్నూల్‌ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు సి.ముక్కన్న, అధ్యక్షతన వీరనారి ఐలమ్మ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సి.గురుశేఖర్‌ మాట్లాడుతూ …. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం ఎన్నికల ముందు రజక వృత్తిదారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. 1982 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా …. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీ 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత రజక ఫెడరేషన్‌ ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఫెడరేషన్‌ ద్వారా ఇప్పటివరకు రజక వృత్తిదారులకు పనిముట్లు, రుణాలు ఆర్థిక సహకారం అందించేవారని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం ఫెడరేషన్‌ ని కార్పొరేషన్‌ చేసి రజక కార్పొరేషన్‌ కోసం నిధులు కేటాయించకుండా కాలయాపన చేశారన్నారు. వెంటనే రజక కార్పొరేషన్‌ కి రూ.1000 కోట్ల బడ్జెట్‌ ను కేటాయించి గతంలో ఫెడరేషన్‌ ద్వారా రజక సొసైటీలను రాష్ట్రంలో వేల సంఖ్యలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నామన్నారు. వాటికి రుణాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కనుక కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించి గత ఫెడరేషన్లను పునః ప్రారంభించాలని కోరారు. సొసైటీల కు కార్పొరేషన్‌ ద్వారా బ్యాంకుతో నిమిత్తం లేకుండా 90 శాతం సబ్సిడీతో రుణాలు అందించాలని కోరారు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాల పూర్తయిన నేటికీ కూడా రజక వృత్తిదారులపై దాడులు సాంఘిక బహిష్కరణలు జరుగుతున్నాయని వీటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ తరహాలో సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. గీత మత్స్య చేనేత కార్మికులకు ఇచ్చిన విధంగా సామాజిక సేవ వృత్తి చేసే రజక వృత్తిదారులందరికీ 5,000 రూపాయలు పెన్షన్‌ మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదిరి ఇంటి దగ్గరే ఉర్దూ చేసే వారందరికీ కేటగిరి వన్‌ కింద ఉచిత కరెంటును అమలు చేయాలని కోరారు. యువగళం పాదయాత్రలో లోకేష్‌ రజక లాండ్రీ షాపులకు దోబిగాట్లకు 500 ఉచిత యూనిట్లు విద్యుత్తులో ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చారని దాన్ని అమలుపరచాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదిరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రభుత్వ శాఖలలో దోబీ పోస్టులను రజక వఅత్తిదారులు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విశ్వకర్మ కౌశల్య యోజన పథకం ద్వారా ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు సి.హనుమంతు, జిల్లా ట్రెజరర్‌ సిహెచ్‌. శ్రీనివాసులు, జిల్లా సహాధ్యక్షులు పర్ల సుంకన్న, సి శేషాద్రి, సి.జయమ్మ, జిల్లా సహకార్యదర్శులు సి.రాముడు, శేఖర్‌ బాబు, తదితరులు పాల్గొన్నారు.

➡️