ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : ఏపీకి ద్రోహం చేసిన మోడీ గో బ్యాక్ అంటూ సిపిఎం నాయకులు నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, కడప స్టీల్ పరిశ్రమలను అటకెక్కించిన మోడీ ఏ మొఖం పెట్టుకొని నేడు విశాఖ వస్తున్నారంటూ విమర్శించారు. ప్రధాని మోడీ విశాఖ పర్యటనను మంగళవారం సీపీఎం నాయకులు స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద గో బ్యాక్ మోడీ అంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి గంధం మణి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయడాన్ని ఆపాలంటూ కార్మికులు ఓ పక్క పోరాటాలు చేస్తుంటే పట్టించుకోని మోడీ, మిట్టల్ స్టీల్ పరిశ్రమకు చేయూతనిచ్చేందుకు విశాఖ వస్తుండడం సిగ్గుచేటన్నారు. ‘పిల్లికి చెలగాటం..ఎలుకకు ప్రాణసంకటం’ అన్న సామెతన కడప ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం రాయలసీమ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఓడరేవులు, రోడ్లు, రైల్వే లైన్లు, సోలార్ గాలిమరల విద్యుత్ ఉత్పత్తి పేరుతో రాయలసీమలోని వేల ఎకరాల భూములను అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు కట్టబట్టేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధమైనా, నిలదీయలేని పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీ వైసిపి, కూటమి అధికారంలో ఉన్న కూటమి పార్టీలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. వామపక్షాలు, ముఖ్యంగా సిపిఎం రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రాన్ని నిలదీస్తోందని స్పష్టం చేశారు. నాయకులు అంగేరి పుల్లయ్య, పెనగడం గురవయ్య, కుమార్, రాధమ్మ, వెంకటేష్, లాల్ బాషా, రషీద్, అన్వర్ బాషా, గురునాధం తదితరులు పాల్గొన్నారు.