ఆదోని (కర్నూలు) : కర్నూలు జిల్లా ఆదోని మండలంలో పెత్తందారులు చెలరేగిపోయి భూ వివాదం నేపథ్యంలో దళిత మహిళపై ట్రాక్టర్ ఎక్కించి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.వెంకన్న డిమాండ్ చేశారు. శనివారం వెంకన్న ఓ ప్రకటన విడుదల చేశారు. కర్నూలు జిల్లా అదోని మండలంలోని నాగనాతన హళ్లి గ్రామానికి చెందిన దళిత మహిళ గుండమ్మ (55) అదే గ్రామానికి చెందిన రాఘవేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డిల సమీప బంధువు (పిన తల్లి) తిరుపతమ్మ వద్ద కొంత కాలం క్రితం నాలుగు ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశారని అయితే, ఆ పొలంలో తమకు వాటా ఉందంటూ రాఘవేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి కోర్టులో దావా వేశారని తెలిపారు. భూ వివాదం కోర్టు పరిధిలో ఉండగానే పొలం దున్నేందుకు రాఘవేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మరో నలుగురు వ్యక్తులు ట్రాక్టర్ తో దుక్కు దున్నడానికి పొలానికి వెళ్లారని అన్నారు. వీరిని గుండమ్మ అడ్డు కోనే ప్రయత్నం చేయగా, కొద్ది సేపు వాగ్వాదం జరిగిందన్నారు. ఇంతలోనే పొలం దున్నడానికి తీసుకు వచ్చిన ట్రాక్టర్ను గుండమ్మ పైకి ఎక్కించి చంపేశారని తెలిపారు, దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారని చెప్పారు. ఆమెకు తోడుగా వెళ్లిన పురుషోత్తంరెడ్డి అనే మరో వ్యక్తి పైనా రాఘవేంద్రరెడ్డి, శ్రీధర్రెడ్డి అనుచరులు దాడి చేసి గాయపరిచారని తెలిపారు. ఇలాంటి మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని వెంకన్న డిమాండ్ చేశారు.
దళిత మహిళపై ట్రాక్టర్ ఎక్కించి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి : ఎపి వ్య.కా.సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.వెంకన్న
