ఎపిఎండిసి అసిస్టెంట్‌ మేనేజర్‌ను సస్పెండ్‌ చేయాలి : ‘సిటు’

ప్రజాశక్తి-ఓబులవారిపల్లె ఎపిఎండిసి సంస్థ మంగంపేట బ్రాంచ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ హెచ్‌ఆర్‌డిగా విధులు నిర్వర్తిస్తున్న నారాయణరెడ్డి అవినీతి పరాకాష్టకు చేరిందని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. స్థానిక యూనియన్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వీస్‌ రిజిష్టర్‌లో సంతకాలు పెట్టకుండా అసిస్టెంట్‌ మేనేజర్‌ హెచ్‌ఆర్‌డి సంబందించిన వ్యక్తులు సెలవు కాగితం పెట్టినా సర్వీస్‌ రిజిస్టర్‌లో నమోదు చేయ లేదన్నారు. నెల అటెండెన్స్‌ పూర్తిగా వేయటం వలన ఆ ఉద్యోగులు సరిగ్గా విధులకు హాజరు కాకుండా ఎప్పుడూ సెలవులపైన ఉంటున్నారని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఒ సర్వీస్‌ రిజిష్టర్‌ పరిశీ లించగా ఆయన కొన్ని సంవత్స రాలుగా సంతకాలు పెట్టలేదని తెలిసిందన్నారు. ఈ విష యాన్ని సిపిఒను అడగగా సంతకాలు పెట్టలేదనేది వాస్తవమేనని తెలిపారని చెప్పారు. దీనిపైన విచారణ చేసి బయోమెట్రిక్‌ ఫింగర్‌ ప్రింట్స్‌, సెక్షన్‌ అలాట్మెంట్‌, జీతముల హాజరు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. మెడికల్‌ బిల్లులు చూసుకోమని ఆయనకు బాధ్యతలు అప్పగిస్తే ఆయన సతీమణికి ఆస్పత్రిలో చూపించకుండా బిల్లులు మంజూరు చేసుకున్నారని ఆరోపించారు. మరి కొంత మంది కార్మికులకు ఆశ చూపించి వారి కార్డు లను ఇప్పించుకుని లక్షల్లో మెడికల్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా వసూలు చేశారని, వీటన్నింటికి ఆధారాలు ఉన్నాయని అన్నారు. మంగంపేట బ్రాంచ్‌లో టెం డర్లు వేస్తే అతనికి ముందుగానే తెలుస్తుందని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అతని బినామీలను రప్పించి టెండర్లు వేయిస్తూ అధికార దుర్వియోగానికి పాల్పడుతున్నారు తెలిపారు. మహిళా ఉద్యోగి మెటర్నిటీ సెలవు విషయంలో ఆమెకు సుమారు మూడు నెలలు జీతం రావలసి ఉన్నా రాకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఈయనను సస్పెండ్‌ చేసి పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు లేని యెడల కార్మికులు, కార్మిక సంఘాలను కలుపుకుని జిల్లా వ్యాప్తంగా ఎపిఎండిసి కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామనిహెచ్చరించారు.

➡️