- ఏపిపిజిసెట్-2025 ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం
ప్రజాశక్తి – క్యాంపస్ (తిరుపతి) : రాష్ట్రవ్యాప్తంగా స్విమ్స్, జేఎన్టీయూ వర్సిటీలలోని వివిధ పీజీ సైన్స్ కోర్సులతోపాటు, దాదాపుగా 17 విశ్వ విద్యాలయాలలో వివిధ పీజీ కోర్సులలో 2025-26 అకడమిక్ సంవత్సరానికి చేరే ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ పీజీ సెట్ చైర్మన్, ఎస్వీయూ ఇంచార్జీ విసి ఆచార్య సిహెచ్ అప్పారావు పేర్కొన్నారు. గురువారం ఆయన విసి చాంబర్లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏపిపిజిసెట్ – 2025 నిర్వహణ బాధ్యతలను శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అప్పగించిన విషయం తెలిసిందేనని అన్నారు. ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో మార్చి 31 వ తేదీన ఏపిపిజిసెట్ – 2025 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఏప్రిల్ 2వ తేదీన ఆన్లైన్ దరఖాస్తులు ఆరంభమైనాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షను తొలిసారిగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఏపిపిజిసెట్-2025 నిర్వహించే బాధ్యతను ఉన్నత విద్యామండలి అప్పగించిందని, ఈ సారి ఎం.ఏ, ఎం.కామ్, ఎం.ఎస్సీ వంటి పిజి కోర్సుల్లో విద్యార్థులు ఎక్కువగా చేరే విధంగా ప్రణాళికలు సిద్ధంగా చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారి సిటీల అన్ని వర్సిటీలలో వివిధ పీజీ కోర్సులలో చేరే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు ఏప్రిల్ రెండవ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమైందని వివరించారు. ఆసక్తి ఉన్న డిగ్రీ పూర్తి చేసిన, డిగ్రీ ఫైనలియర్, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వివిధ కోర్సులలో చేరేందుకు అర్హులన్నారు. దరఖాస్తులను విద్యార్థులు, అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఓసీ విద్యార్థులు -850/- రూపాయలు, బిసి విద్యార్థులు -750/- రూపాయలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు – 650/- రూపాయల ఆన్లైన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వివిధ కోర్సులు, ఆయా కోర్సులకు సంబంధించి రెగ్యులర్, సెల్ ఫైనాన్స్, మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన సీట్ల పూర్తి వివరాలతో వెబ్సైట్లో ఉంచడం జరిగిందని వివరించారు. ఏపీ పీజీ సెట్ కన్వీనర్ ఆచార్య పీసీ వెంకటేశ్వర్లు, కో కన్వీనర్ ఆచార్య సురేంద్రబాబు కొంగర మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పీజీ సెట్ ప్రవేశ పరీక్షలో విద్యార్థులు ఆరో సెమిస్టర్ పూర్తి అవగానే వివిధ పీజీ కోర్సుల్లో చేరేందుకు అర్హులన్నారు. దీనికి సంబంధించిన కోర్సులకు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా వివరాలను సమాచారం పూర్తిగా వెబ్సైట్లో అందుబాటులో ఉందని వెల్లడించారు. విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మే 5వ తేదీ వరకు వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వివిధ రకాల అపరాధ రుసుముతో మే 5 వరకు అప్లై చేసుకునే అవకాశం వుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత విద్య వలన ఎన్నో ఉన్నతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని సూచించారు. ఈ ఎంట్రన్స్ పరీక్ష 153 కోర్సుల్లో చేరడానికి 31 సబ్జెక్ట్స్ పరీక్షలను జూన్ 6 నుంచి 13 వరకు మూడు సెషన్స్ లలో నిర్వహిస్తారని,13 పాత జిల్లా కేంద్రాలను ఆధారంగా దాదాపు 35 పరీక్ష కేంద్రాలలో పరీక్ష జరుగుతుందని వివరించారు. రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల్లో ఆర్ట్స్, కామర్స్, ఎడ్యుకేషన్, సైన్సెస్ లలో 30,534 సీట్లకు పిజిసెట్-2025 నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సారి అడ్మిషన్లలో పిజి కోర్సుల్లో విద్యార్థులు బాగా చేరుతారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపిపిజిసెట్ కార్యాలయ సిబ్బంది, ఏపిఆన్లైన్ సహాయకులు పాల్గొన్నారు.