స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ఆహ్వానం : ఎంపీడీవో రాజు

Mar 13,2025 16:43 #almuru, #Konaseema, #mpdo

ప్రజాశక్తి – ఆలమూరు : ఈనెల 22 లోపు స్వయం ఉపాధి పథకాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఎల్పిఓ ఎంపీడీవో ఐ.రాజు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగా మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. 2024 – 25 ఏడాదికి గాను వెనుకబడిన తరగతులు ఆర్థికంగా వెనుకబడిన వివిధ సామాజిక వర్గాల వారికి ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో బి ఫార్మసీ, డి ఫార్మసీ విద్యార్హత ఉన్న యువత తో పాటుగా బట్టలు అల్లిక, కమ్మరి, కుమ్మరి, మేదర వంటి సామాజిక వర్గాల సంక్షేమం కోసం సబ్సిడీ లోన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కాపు సామాజిక వర్గం వారికి ఎం.ఎస్.ఎం.ఇ పథకం ద్వారా చిన్న పరిశ్రమలు స్థాపించుకొనుటకు సబ్సిడీ లోన్లు మంజూరు కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అలాగే పైన తెలిపిన తరగతుల మహిళల అభ్యున్నతి కోసం ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు 18 నుంచి 50 ఏళ్ల లోపు వయసు వారికి, ఆధార్ కార్డు, మొబైల్, వైట్ రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులు మీసేవ ద్వారా గాని, స్థానిక సచివాలయంలో గాని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనుమానాల నివృత్తి కోసం మండల పరిషత్ కార్యాలయంలో సాంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఏవో మెహర్ ప్రకాష్ పాల్గొన్నారు.

➡️