చింతలతండాలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు
ప్రజాశక్తి – మాచర్ల : పనులకు బడ్జెట్ ఆమోదం లేని కారణంగా ఉపాధి హామీ పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. మండల పరిధిలో 15 గ్రామ పంచాయితీ గ్రామాలుకుగాను 10 గ్రామాల్లోనే అంతంత మాత్రంగా పనులు జరుగుతున్నాయి. మండలంలో 12,606 జాబ్ కార్డులు ఉండగా తొమ్మిది వేల మంది క్రీయాశీలక కూలీలు ఉన్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసిలే అధికం. వీరిలో రోజుకు 400 మందికి మాత్రమే పనులు కల్పిస్తున్నారు. వ్యవసాయంలో యంత్రాల వినియోగం, పొలాలన్నీ సాగవ్వకపోవడం తదితర కారణాలతో కూలీ పనులు తగ్గాయి. ఈ నేపథ్యంలో కూలీలకు పనులు చూపించి, జీవనోపాధి కల్పించడం ద్వారా ఆర్థిక, సామాజిక, ఆహార భత్రలను పెంపొందించే ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది. కొలతల ప్రకారం పని చేసిన వారికి రోజుకు రూ.300 చొప్పున 2024-25 ఆర్థిక సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే మండలంలోని కూలీలకు వందరోజుల పనిదినాలు గాను సరాసరి 40 పనిదినాలు, రోజుకు రూ.277 మాత్రమే కూలి దక్కుతోంది. వెనకబడిన పల్నాడు ప్రాంతమైన పల్నాడులో భాగంగా ఉన్న మాచర్ల ప్రాంతంలోనూ వ్యవసాయ పనులు అంతంత మాత్రమే కావడం, ఉపాధి పనులు పెద్దగా కల్పించకపోవడం, అందులోనూ కూలి తక్కువగా ఉండడంతో కూలీల జీవనం అస్తుబిస్తుగా గడుస్తోంది. పనిదినాలు పెంచి, అధిక వేతనాలు చెల్లించాలని కూలీలు కోరుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు చేపట్టి, పనిలేని వారికి పని కల్పించాలని గ్రామీణులు కోరుతున్నారు.
రోజు కూలి రూ.600 ఇవ్వాలి
బండ్ల మహేష్, సిఐటియు పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి.గ్రామాల్లో వలసల నివారణ అనేది ఉపాధి హామీ చట్టం తేవడం వెనక ముఖ్య లక్ష్యాల్లో ఒకటి. అయితే ప్రస్తుతం కల్పిస్తున్న పనిదినాలు, అందిస్తున్న వేతనాలు చాలక కూలీలు తమ పిల్ల పాపలతో సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్లే దుస్థితి వస్తోంది. ఏడాదికి పని దినాలను 200 రోజులకు పెంచి, కనీస వేతనం రూ.600 చెల్లించాలి. ఉపాధి కూలీలకు ప్రభుత్వమే పనిముట్లుకు కావాల్సిన డబ్బులు చెల్లించాలని, పని ప్రదేశాలకు రవాణా ఛార్జీలతో పాటు తాగునీటి అలవెన్స్, వేసవి కాలం నిమిత్తం 30 శాతం అలవెన్సును చెల్లించాలి. పని ప్రాంతాల్లో ఉపాధి కూలీల రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలి.
రూ.3.60 కోట్ల ప్రతిపాదనలు
టి.నాగశ్రీనివాస్, ఎంపిఒ, మాచర్ల మండలం.
మండల పరిధిలో ఉపాధి పనులు చేపట్టేందుకు ఈ ఆర్థిక సంవత్సారానికి రూ.3.60 కోట్ల ప్రతిపాదనలతో బడ్జెట్ రూపొందించి నెల క్రితం ఉన్నతాధికారులకు పంపాం. ఎన్నికల కోడ్ కారణంగా ఆమోదం కాలేదు. ఈ వారంలో బడ్జెట్‌కు అమోదం లభిస్తుంది. అన్ని గ్రామాల్లో పనులు చేయిస్తాం. మొదటి ప్రాధాన్యతతో ఫారం పాండ్స్, ఇంళ్లల్లో ఇంకుడు గుంతలు, పండ్లతోటలు, కంపొస్టు ఫిస్టు పనులు, ఆతరువాత ప్రాధాన్యతలో చెరువులు, కుంటలు, కాల్వలు పనులు చేపడతాం. పని ప్రాంతాల్లో కూలీలకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. 25-50 మంది సభ్యులతో నూతన శ్రమశక్తి సంఘాలను ఏర్పాటు చేస్తున్నాం.
