సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా
ప్రజాశక్తి-గుంటూరు : ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ 2025-26 ఆర్థిక సంత్సరానికి 643.80 కోట్ల అంచనాతో బడ్జెట్‌కు జెడ్పి స్థాయి సంఘం ఆమోదం తెలిపింది. శనివారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాయంలో జెడ్పీ స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. జెడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరిగిన 1వ స్థాయి సంఘ సమావేశంలో నూతన బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఇందులో జెడ్పీతోపాటు, అనుబంధ శాఖలుగా ఉండే పంచాయితీరాజ్, ఆర్‌డబ్యూఎస్ వంటి శాఖల బడ్జెట్ కలిసి ఉంది. ఇందులో కేవలం జెడ్పీ బడ్జెట్ రూ.71.11 కోట్ల అంచనాతో రూపొందించారు. స్థాయి సంఘాలు ఆమోదించిన ఈ బడ్జెట్ అంచనాలను రాబోయే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆమోదం కోసం ప్రవేశడతారు. 7వ స్థాయి సంఘ సమావేశంలో చైర్‌పర్సన్ మాట్లాడుతూ జెడ్పీ నుండి మంజూరు చేసిన పనులలో గత సంవత్సర కాలంగా ప్రారంభం కాని పనులు రద్దు అయినట్లు చెప్పారు. వాటిలో అవసరం ఉన్న పనులు కొత్త ప్రతిపాదనల కింద చేపట్టి మంజూరు చేస్తామన్నారు. ఆ విధంగా ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల్లో మంజూరు చేసి, ప్రారంభం కాని పనుల వివరాలు ఆయా శాఖల అధికారులకు చైర్‌పర్సన్‌కు అందజేశారు. అలాగే కాలంలో చేపట్టబోయే పనులకు సంబంధించి రూ.9.14 కోట్ల అంచనాలతో 108 పనులకు ఆమోదం తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో అమలు జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలైన గృహ నిర్మాణం, రోడ్ల నిర్మాణాలు, పల్లె పండుగ పనులు, ఉపాధి హామీ తదితర పనుల గురించి అధికారులు సమావేశాల్లో వివరించారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించి రెండో స్థాయి సంఘం, విద్య, వైద్యంకు సంబంధించి నాలుగో స్థాయి సంఘ సమావేశం జెడ్పీ చైర్‌పర్సన్ అధ్యక్షతన జరిగాయి. వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి 3వ స్థాయి సంఘం సొంటిరెడ్డి నర్సిరెడ్డి అధ్యక్షతన, మహిళా సంక్షేమానికి సంబంధించి 5వ స్థాయి సంఘ సమావేశం పిల్లి ఉమాప్రణతి అధ్యక్షతన, సాంఘిక సంక్షేమానికి సంబంధించి 6వ స్థాయి సంఘం బి.అనురాధ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశాలను జెడ్పి సిఇఒ జ్యోతిబసు పర్యవేక్షించారు.