అరకోటి హాంఫట్‌

May 14,2024 22:14

ప్రజాశక్తి-విజయనగరంకోట : ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్‌లో అధికారులు కోతపెట్టారు. ఇలా కోతపెట్టిన మొత్తం వ్యాప్తంగా సుమారు రూ.50 లక్షలు వరకు హాంఫట్‌ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు రోజులుపాటు శిక్షణ, మరో మూడు రోజులు పాటు పోలింగ్‌, ఇవిఎంల అప్పగింత పనులు చేసిన సిబ్బందికి కుచ్చుటోపీ పెట్టారు. ఈనేపధ్యంలో అధికారుల తీరుపై ఉద్యోగులు మండిపడు తున్నారు. ఉద్యోగు లకు అరకొర మొత్తం చేతిలో పెట్టి ఇళ్లకు పంపడంపట్ల జిల్లా వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. విజయనగరం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సుమారు 13,661 మంది పిఒలు, ఎపిఒలు, ఒపిఒలు విధులు నిర్వహించారు. వీరిలో పిఒలు 2290 మంది, ఎపిఒలు 2306, ఒపిఒలు 9065 మంది ఉన్నారు. వీరు కాకుండా సెక్టార్‌ ఆఫీసర్లు 225, నోడల్‌ అధికారులు 16 మంది, మైక్రో ఆబ్జర్వర్లు 445, బిఎల్‌ఒలు 1847, ఇవిఎంల స్వీకరించే సిబ్బంది 728మంది ఉన్నారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో అంతా కలిపి 6,600మంది ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహించారు. పిఒ, ఎపిఒలు మూడు రోజులు పాటు శిక్షణతో పాటు రెండు రోజులు పాటు పోలింగ్‌ విధులు, మంగళవారం మధ్యాహ్నం వరకు ఇవిఎంల అప్పగింతతో మొత్తంగా ఆరు రోజులు పాటు పనిచేశారు. ఒపిఒలకు శిక్షణ లేనందున మూడు రోజులు పాటు పోలింగ్‌ విధులు నిర్వహిస్తున్నట్లు లెక్క. పిఒ, ఎపిఒలకు రోజుకు రోజుకు రూ.350 చొప్పున, ఒపిఒలకు రోజుకు 250 చొప్పున చెల్లించాలని ఎన్నికల సంఘం జారీ చేసిన సర్కులర్‌లో పేర్కొంది. ఈ లెక్కన పిఒలు, ఎపిఒలకు ఆరు రోజులుకు టిఎ, డిఎలతో కలిపి రూ.2100, ఒపిఒలకు రూ.750 చొప్పున చెల్లించాల్సి ఉంది. కానీ అధికారులు పిఒ, ఎపిఒలకు రూ.1750, ఒపిఒలకు రూ.500 మాత్రమే చెల్లించారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత సెక్టోరల్‌ అధికారులు వారికి ఆమొత్తాన్ని చేతిలో పెట్టడంతో చాలాచోట్ల వారంతా తీవ్ర ఆవేదన చెందారు. మూడు రోజులు పాటు విధులు నిర్వహిస్తే రోజుకు రూ. 166 చొప్పున రూ.500 చెల్లించడమేమిటని ప్రశ్నించారు. వీటికి బదులు ఉపాధి కూలీయే నయమని ఆవేదన చెందారు. దీంతో అధికారులు తామేమీ చేయలే మంటూ ఆ మొత్తాన్ని సిబ్బంది చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ఈలెక్కన జిల్లా మొత్తంగా రూ.38లక్షల, 74వేల, 850ను అధికా రులు మింగేసినట్లు ఆరోపణలు వినిపిస్తు న్నాయి. మరోవైపు మిగతా సిబ్బందికికూడా చెల్లింపుల్లో కోత పెట్టినట్లు తెలిసింది. అంతేకాకుండా పోలింగ్‌రోజున పోలింగ్‌ బూత్‌ల్లో అందించిన నాణ్యత లేని భోజనాల్లో భారీగా వెను కేసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ లెక్కన జిల్లా మొత్తంగా సుమారు రూ.50లక్షలు వరకు హాంఫట్‌ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో అధికారుల తీరుపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలింగ్‌ విధులకు వెళ్లిన సిబ్బందికి ఆదివారం రాత్రి, సోమవారం సరైన భోజనాలు లేక అల్లాడిపోయారు. ఎప్పుడో తయారు చేసిన భోజన ప్యాకెట్లు ఇవ్వడం, అవి కూడా పాడవ్వడంతో పలుచోట్ల సిబ్బంది తినేందుకు ఇబ్బంది పడ్డారు. సోమవారం అర్ధరాత్రి ఇవిఎంలను తీసుకొని రిసెప్షన్‌ కేంద్రాలకు చేరుకున్నారు. వాటిని అక్కడ అప్పగించేందుకు సుమారు మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టడంతో రాత్రి 12 తరువాతే భోజనాలు చేయాల్సి వచ్చింది. అనంతరం స్వగ్రామాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయం లేక నానా అగచాట్లు పడ్డారు.

➡️